26.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

జనవరి 1 నుంచి నుమాయిష్… ఎగ్జిబిషన్ నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం!

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏటా నిర్వహించే అఖిల భారతీయ పారిశ్రామిక వస్తు ప్రదర్శన (నుమాయిష్‌) జనవరి 1న ప్రారంభానికి అంతా సిద్ధమైంది. కొన్ని దశాబ్దాలుగా  హైదరాబాదీలను విపరీతంగా  అలరిస్తున్న 82వ ఆల్-ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్… 2023 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజులపాటు కొనసాగనుంది.

కోవిడ్ మహమ్మారి కారణంగా, సొసైటీ 2021లో ఎగ్జిబిషన్ నిర్వహించలేదు; ఈ ఏడాది షెడ్యూల్‌ ప్రకారం జరగలేదు.  దీంతో ఈసారి పెద్ద ఎత్తున ప్రజలు నుమాయిష్ ను సందర్శించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం సందర్శకులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడానికి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు.

“దేశవ్యాప్తంగా వ్యాపారుల నుండి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్‌లో కాశ్మీర్ నుండి కన్యా కుమారి వరకు వ్యాపారుల నుండి స్టాల్స్ ఉంటాయి. ఈ సంవత్సరం సొసైటీ 2,000 స్టాల్స్‌ను కేటాయించడానికి సిద్ధంగా ఉంది” అని ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుడు చెప్పారు.

2020లో నుమాయిష్ లో అగ్ని ప్రమాదం జరగడం, గతేడాది (2021) కోవిడ్ కారణంగా నష్టాలు రావడంతో ఈ సారి ఎగ్జిబిషన్ సొసైటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఈ నేపథ్యంలో నష్టాలను పూడ్చుకునేందుకు ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజును పెంచాలని నిర్ణయించింది. గతంలో 30 రూపాయలుగా ఉన్న ఎంట్రీ టికెట్ ధరను పది రూపాయలు పెంచి.. 40 రూపాయలు చేసింది.

పార్కింగ్ రుసుం విషయంలో మాత్రం.. ఎలాంటి మార్పులు చేయలేదు. ఎగ్జిబిషన్ ను సందర్శించడానికి వచ్చే ఫోర్ వీలర్స్‌కు 50 రూపాయలు, టూవీలర్స్‌కు 20 రూపాయలు వసూలు చేయనున్నారు.

టైమింగ్స్‌ లో మార్పు..

సాధారణంగా ఏటా నుమాయిష్ ప్రదర్శన మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు కొనసాగుతుంది. ఇక వీకెండ్స్ లో మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహిస్తారు. ఈసారి అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగించేందుకు పోలీసులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

మౌలికసౌకర్యాలు భేష్:

నుమాయిష్ తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాదీలకు, వినోదం, విశ్రాంతి, షాపింగ్, వినోదాల వేదిక. దాదాపు 20 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. 45 రోజుల పాటు ప్రతిరోజూ సగటున 45,000 మంది సందర్శకులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోకి ప్రవేశిస్తారు. ఈ నేపథ్యంలో మౌలికసౌకర్యాలకు మెరుగులు దిద్దారు.

మహిళలు  సీనియర్ సిటిజన్‌ల కోసం నడక మార్గాలు మెరుగుపరిచారు. ముఖ్యంగా  వీల్‌చైర్‌లో తిరిగేందుకు వీలుగా ఆ మార్గాన్ని కూడా  విస్తరించారు.  2020లో రూ. 3 కోట్ల వ్యయంతో అగ్నిమాపక సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

ఎగ్జిబిషన్ సొసైటీ ఎనిమిది దశాబ్దాలకు పైగా నుమాయిష్‌ను ఏటా విజయవంతంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్ నగరవాసులు ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ కోసం ఆత్రుతగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది సందర్శకులు వినోదం, షాపింగ్ కోసం పదే పదే వస్తుంటారు. ‘నుమాయిష్’ 1938లో దేశంలోని చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తులను ప్రోత్సహించడానికి పారిశ్రామిక ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రారంభించారు.  మొదటి ప్రదర్శన 1938లో పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఇది 1946లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు మార్చారు. ఎగ్జిబిషన్ సొసైటీ 1966లో రజతోత్సవం, 1998లో స్వర్ణోత్సవం, 2000లో డైమండ్ జూబ్లీ,  2015లో ప్లాటినం జూబ్లీ జరుపుకుంది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles