30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

ఎమ్మెల్సి కవిత స్టేట్‌మెంట్ రికార్డ్… 7 గంటలపాటు విచారించిన సీబీఐ!

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో భాగంగా నిన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో నిన్న సాయంత్రం ఈ విచారణ ముగిసింది.  ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. లిక్కర్ స్కాంలో సాక్షిగా కవిత వాంగ్మూలం నమోదు చేసింది.

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా లిక్కర్ స్కాం నిందితుడు అమిత్ అరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తనకు తెలిసిన వివరాలన్నింటినీ ఆమె సీబీఐ అధికారులకు చెప్పినట్లు సమాచారం. నోటీసులపై ఆమె ఇప్పటికే తన న్యాయ నిపుణులతో చర్చించి, తన వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని సీబీఐ అధికారులకు అందించినట్లు తెలిసింది. ఇప్పటికైతే విచారణ ముగిసిందని..మళ్లీ ఎప్పుడైనా అవసరమనుకుంటే విచారిస్తామని సీబీఐ తెలిపింది. కవిత నుంచి అవసరమైన సమాచారం సేకరించామని సీబీఐ స్పష్టం చేసింది.  సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో సీబీఐ అధికారులు కవిత ఇంటి నుంచి వెళ్లిపోయారు.

సీబీఐ విచారణ పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేసి..బయటివారిని లోపలకు రానివ్వలేదు. ఆమె నివాసానికి 100-120 మీటర్ల దూరంలో ఎవరూ గుమికూడకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

అయితే మీడియా ప్రతినిధులతో పాటు బీఆర్‌ఎస్ నేతలు బారికేడ్ల వద్దకు చేరుకున్నారు. ఆమె నివాసానికి సమీపంలో  మద్దతుదారులు హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. “యోధుడి కూతురు ఎప్పటికీ భయపడదు. మేము కవితక్కతో ఉన్నాము”  అని హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.

కవిత నివాసం నుంచి సీబీఐ అధికారులు బయలుదేరిన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆమె నివాసానికి చేరుకున్నారు. అనంతరం  కవిత..ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా దాదాపు 45 నిమిషాలు సమావేశమయ్యారు. అటు సీబీఐ విచారణ ఇటు ముఖ్యమంత్రితో సమావేశం వివరాల్ని కవిత వెల్లడించలేదు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles