24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్‌… 10 మంది అరెస్ట్‌!

ప్రధానాంశాలు
  • టీఎస్పీఎస్సీకి చెందిన ఇంటిదొంగలే పేపర్ లీకేజీ సూత్రధారులు
  • సన్నిహిత టీచర్ కోరడంతో పేపర్ బయటికి తెచ్చిన ప్రవీణ్
  • సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్ నుంచి తస్కరణ
  • దళారీ ద్వారా ముగ్గురికి విక్రయించిన సదరు టీచర్, ఆమె భర్త
  • రూ.14 లక్షలు వసూలు.. అందులో రూ.10 లక్షలు ప్రవీణ్ కు..
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బేగంబజార్ పోలీసుల
  •  1౦ మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌లో 10 మందిని బేగంబజార్‌ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు టీఎస్‌పీఎస్‌సీ హెడ్‌ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్‌కుమార్‌గా గుర్తించారు.

కేసులో కొంతమంది అనుమానితులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని డీసీపీ (సౌత్ వెస్ట్) కిరణ్ ఖరే తెలిపారు.

దీని గురించి తెలుసుకుని ఆన్‌లైన్ హ్యాకింగ్ అనుమానంతో TSPSC మార్చి 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుకు సంబంధించిన పరీక్షను వాయిదా వేసింది.

అసలేం జరిగిందంటే….

సోదరుడి కోసమంటూ అడిగి…

హైదరాబాద్ లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రేణుకకు కొన్నాళ్లుగా ప్రవీణ్‌ కుమార్‌తో పరిచయం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టీఎస్పీఎస్సీ పరీక్షలకు రేణుక సోదరుడు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఆదివారం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష రాయాల్సి ఉంది. పోటీ ఎక్కువగా ఉండటంతో తన సోదరుడిని ఎలాగైనా గట్టెక్కించాలని భావించిన రేణుక తన భర్తతో కలిసి ప్రవీణను సంప్రదించింది.

టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కావాలని కోరింది. అప్పటికే ఆమెతో సన్నిహితంగా ఉంటున్న ప్రవీణ్ వెంటనే అంగీకరించాడు. టీఎస్ పీఎస్సీలో నెట్వర్క్ అడ్మిన్ గా పనిచేస్తున్న రాజశేఖర్‌తో కలిసి పేపర్ తస్కరణకు పథకం వేశాడు. ఈ పేపర్లు కమిషన్కు చెందిన సెక్షన్ ఆఫీసర్ శంకరమ్మ ఆధీనంలో, ఆమె కంప్యూటర్లోనే ఉంటాయి. ఈ విషయం తెలిసిన ప్రవీణ్, రాజశేఖర్ ఆ కంప్యూటర్ పై నిఘా పెట్టారు. కార్యాలయం నుంచి అంతా వెళ్లిపోయేదాకా వేచిచూసిన ఈ ఇద్దరూ.. మెల్లగా ఆ పేపరు ఓ పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకున్నారు. దాన్ని తీసుకెళ్లి రాజశేఖర్ కంప్యూటర్ నుంచి ప్రింట్ ఔట్ తీసుకున్నారు. ప్రవీణ్ ఈ ప్రశ్నపత్రాన్ని తీసుకువెళ్లి రేణుక, ఆమె భర్తకు అప్పగించాడు.

అయితే రేణుక పేపరు సోదరుడికి ఇవ్వడంతోపాటు జిరాక్సు తీసి పెట్టుకుంది. తమ స్వగ్రామం సర్పంచ్ కుమారుడితో తన వద్ద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉంటే విక్రయిస్తానని చెప్పింది. సర్పంచ్ కుమారుడు తనకు తెలిసిన ముగ్గురు అభ్యర్థులను ఏర్పాటు చేశాడు. వారికి రూ.14 లక్షలకు పేపర్ను విక్రయించిన రేణుక రూ.4 లక్షలు తాను తీసుకుని, రూ.10 లక్షలను ప్రవీణ్ కు ఇచ్చింది. అతడు ఇచ్చిన పేపరు ఈ నెల 2న తిరిగి ఇచ్చేసింది.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకైన సంగతి తెలుసుకున్న ఓ అభ్యర్థి తన సహచర ‘రూమ్మేట్’కు ఈ విషయం తెలిపాడు. దీంతో కంగుతిన్న ఆ రూమ్మేట్ ఇతర స్నేహితులతో కలిసి శనివారం టీఎస్ పీఎస్సీ వద్దకు వెళ్లి ఆరా తీశాడు. అక్కడి నుంచే ‘డయల్ 100’కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చిన పోలీసులు.. ఈ విషయం ఆరా తీసి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు టీఎస్ పీఎస్సీ సెక్రటరీ దృష్టికి విషయం తీసుకువెళ్లడంతోపాటు పరిశీలన జరపగా పేపర్ లీకేజీపై ప్రాథమిక ఆధారాలు లభించాయి.

టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీపై బేగంబజార్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి.. ప్రవీణ్, రాజశేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో రేణుకతోపాటు ఇతరుల పాత్ర బయటికి వచ్చింది. పోలీసులు మొత్తం 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని… వారి నుంచి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ప్రతులను స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles