26.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

నల్లసముద్ర తీరాన యుద్ధమేఘాలు…. ఉక్రెయిన్‌-రష్యాల మధ్య ఉద్రిక్తత!

మాస్కో: నల్లసముద్ర తీరాన మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఉక్రెయిన్‌ సరిహద్దుల వెంబడి రష్యా లక్ష మంది సైనికులను మోహరించింది. రష్యా నావికాదళం నౌకలు, ట్యాంకులతో సన్నద్ధం అవుతోంది. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం దక్కబోతోందన్న తరుణంలో పొరుగుదేశంపై దండెత్తడానికే రష్యా పూర్వరంగం సిద్ధం చేసుకుంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సంప్రదాయ యుద్ధపద్ధతులకు స్వస్తి పలికిన రష్యా- ఊహించని రీతిలో ఉత్పాతాన్ని సృష్టించవచ్చని నాటో కూటమి అంచనా వేస్తోంది. అందుకు బలాన్నిచ్చేలా జనవరి రెండో వారంలో ఉక్రెయిన్‌ ప్రభుత్వంలోని కీలక విభాగాల్లో డేటా తస్కరణకు గురైంది. ప్రజల వ్యక్తిగత సమాచారం సైబర్‌ దాడులకు లోనైనట్లు ఆ దేశం ప్రకటించింది. అంతకు కొద్దిరోజుల ముందే జెనీవా, బ్రస్సెల్స్‌, వియన్నా నగరాల్లో మాస్కో ప్రతినిధులు, అమెరికా నేతృత్వంలోని నాటో దౌత్యవేత్తల మధ్య వివిధ స్థాయుల్లో జరిగిన సమావేశాల్లో ఇదమిత్థంగా ఏమీ తేలలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోయ్‌ ఆ భేటీల్లోనే విస్పష్ట ప్రకటన జారీచేశారు. ‘ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోకపోవడమే కాకుండా, కొత్తగా పూర్వ సోవియట్‌లోని ఏ భూభాగంలోకీ రానివ్వకూడదు, తూర్పు దిశగా విస్తరణవాద ఆలోచనను విరమించుకుంటున్నట్లు ఆ దేశం లిఖితపూర్వక హామీ ఇవ్వాలి’ అన్నది ఆ హెచ్చరికల సారాంశం. మరోవంక తూర్పు ఉక్రెయిన్ విద్రోహ చర్యలతో అతలాకుతలం చేసి, ఆ నేరాన్ని అక్కడి ప్రభుత్వంపై మోపేందుకు రష్యా కుట్ర పన్నుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. తద్వారా తన దురాక్రమణకు ప్రాతిపదికను సిద్ధం చేస్తోందని చెబుతోంది. ఈ ఆరోపణలను రష్యా కొట్టిపారేసింది. రష్యా, ఉక్రెయిన్ ప్రజలు ఒకటేనని పుతిన్ పదేపదే చెబుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉన్న అనేక భూభాగాలు ఒకప్పుడు రష్యాలో భాగంగా ఉండేవని పేర్కొన్నారు. సోవియట్ హయాంలో వాటిని ఉదారంగా ఉక్రెయిన్ పరం చేశారని ఆరోపిస్తున్నారు. మరోవైపు అమెరికా ఉత్పత్తి చేసిన ట్యాంకు, విమాన విధ్వంసక క్షిపణులను ‘ఉక్రెయిన్‘కు సరఫరా చేయాలని ఎస్తోనియా, లాత్వియా,లిథువేనియాలు నిర్ణయించాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ దీన్ని స్వాగతించారు. సోవియట్ యూనియన్లో ఒకప్పుడు భాగంగా ఉన్న ఆ మూడు దేశాలు ఉక్రెయిన్కు బాసటగా నిలవడాన్ని ప్రశంసించారు. అయితే ఆయుధ సరఫరాను ప్రమాదకరమైన చర్యగా రష్యా ఇప్పటికే అభివర్ణించింది. వీటివల్ల ఉద్రిక్తతలు తగ్గబోవని స్పష్టంచేసింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles