28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

క్రీడా మైదానానికి టిప్పుసుల్తాన్ పేరు… మహారాష్ట్రలో అధికార, విపక్షాల వాగ్వివాదం!

ముంబయి: ముంబైలో పునర్నిర్మించిన ఓ క్రీడా మైదానానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టడంపై మహారాష్ట్ర అధికార, విపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారి తీసింది. పెద్ద సంఖ్యలో హిందువులను చంపిన వ్యక్తి పేరును పెట్టనివ్వబోమని మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు. కాగా, టిప్పుసుల్తాన్ స్వాతంత్ర్య సమరయోధుడని, చరిత్రకు సంబంధించి బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అంతే ఘాటుగా బదులిచ్చారు. కర్ణాటక వెళ్లినప్పుడు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఓ ప్రసంగంలో టిప్పు సుల్తాన్‌ను పొగిడిన విషయాన్ని సంజయ్ రౌత్ గుర్తు చేస్తూ ‘‘రాష్ట్రపతిని రాజీనామా చేయమని కోరతారా?’’ అంటూ దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రశ్నించారు.
ముంబైలోని మాల్వాని ప్రాంతంలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ని పునర్నిర్మించారు. అక్కడి స్థానిక మంత్రి అస్లామ్ షేక్. కాంగ్రెస్ నేత, ముల్వాని ఎమ్మెల్యే అయిన అస్లామ్ తన ఎమ్మెల్యే నిధులను ఇందుకు ఖర్చు చేశారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్న ప్రాంతాన్ని టిప్పుసుల్తాన్ గ్రౌండ్ అని పిలుస్తుంటారు. కావున అదే పేరుని ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కి పెట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ, భజరంగ్‌దళ్ బుధవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి.
ఈ నిరసనలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ ‘‘తమకు మాత్రమే చరిత్ర తెలుసని బీజేపీ అనుకుంటుంది. ఆ పార్టీలో ప్రతి ఒక్కరు తమకు తోచింది రాస్తుంటారు. తామే చరిత్రకారులమని అనుకుంటుంటారు. మాకు టిప్పు సుల్తాన్ గురించి తెలుసు. బీజేపీ చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కర్ణాటక వెళ్లి టిప్పు సుల్తాన్‌ను స్వాతంత్ర్య సమరయోధుడు, చారిత్రకయోధుడు అని పొగిడారు. మరి రాష్ట్రపతిని రాజీనామా చేయాలని అడుగుతారా? బీజేపీ దీనికి వివరణ ఇవ్వాలి. నిజంగా ఇదంతా ఒక డ్రామా. ఆ పేరు మార్చారు, ఈ పేరు మార్చారని మిగతావారిని అంటున్నారు. ఢిల్లీలో కూర్చుని వాళ్లు చేస్తున్నది ఇదే కదా. కానీ బీజేపీ ఎంత ప్రయత్నించినా చరిత్రను మార్చడం వారి వల్ల కాదు’’ అని సంజయ్ అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles