33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

రాష్ట్ర ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం!

హైదరాబాద్:  నిజాంకాలంలో ప్రారంభమై వందేండ్లు పూర్తిచేసుకుంటున్న ఆర్టీసీకి శతవసంతాల వేళ టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆర్టీసీలో పనిచేస్తున్న 46,746 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. బిల్లు ఆమోదం పొందిన వెంటనే టిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. ఇతర శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసే అన్ని ప్రయోజనాలకు వారు అర్హులు.

త్వరలో జరిగే అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేబినెట్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు ఓ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసారు.

కేబినెట్ భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘ఆర్టీసీ విలీనం కోసం ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీలో అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉంటారు. ఆర్‌ అండ్‌ బీ, రవాణాశాఖ, సాధారణ పరిపాలన (జీఏడీ) శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ స్పెషల్‌ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. వీరు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి.. ప్రభుత్వానికి అందజేయాలి.

ఆగస్టు 3వ తేదీన ప్రారంభమయ్యే సమావేశంలోనే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభించనున్నాం. అదే రోజు శాసన సభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడతాం. వెంటనే దానికి సంబంధిన కార్యాచరణ ప్రారంభించాలని కేసీఆర్ శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రికి ఆదేశాలు ఇచ్చారు’’ అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ఆర్టీసీ ప్రస్థానం

నిజాం కాలంలో 1932లో ఆర్టీసీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పట్లో ‘నిజాం రాష్ట్ర రైల్వే-రోడ్డు రవాణా శాఖ’ అని పిలిచేవారు. 27 బస్సులు, 166 మంది సిబ్బంది ఉండేవారు. స్వాతంత్య్రం అనంతరం 1951 నవంబర్‌ 1న హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 1958 జనవరి 11న ఏపీఎస్‌ఆర్టీసీగా అవతరించింది. ఉమ్మడి రాష్ట్రంలో 22,628 బస్సులతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థగా రికార్డులకెక్కింది. 1999లో గిన్నిస్‌ రికార్డు సాధించింది.

2014లో రాష్ట్ర విభజన అనంతరం.. 2015 జూన్‌ 3న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా (టీఎస్‌ఆర్టీసీ) రూపాంతరం చెందింది. అప్పటికి సంస్థకు 98 డిపోలు ఉన్నాయి. టీఎస్‌ ఆర్టీసీకి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్‌ 27న ఆర్టీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది. ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌కు సర్వీసులు నడుస్తున్నాయి. రోజుకు సుమారు 90 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆర్టీసీలో 9,384 బస్సులు ఉన్నాయి. ఇందులో 68 శాతం.. అంటే సుమారు 6,300 బస్సులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 364 బస్‌స్టేషన్లు, 98 డిపోలు ఉన్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles