30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల కోసం ఇంటరాక్టివ్ సైన్స్ పార్క్!

హైదరాబాద్: పచ్చని వాతావరణంలో ఆఫీస్ వర్క్ చేసుకునేలా ఐటీ ఉద్యోగుల కోసం ఓ సరికొత్త, థీమ్ పార్క్‌ను జీహెచ్‌ఎంసీ నిర్మించింది. ల్యాప్‌టాప్‌లతో పాటు, పిల్లల ముసిముసి నవ్వులు కలగలిసి ఉండేలా  గ్రేటర్‌లో తొలిసారిగా ఐటీ కారిడార్‌లో ‘ఇంటరాక్టివ్‌ సైన్స్‌ పార్కు’గా జీహెచ్‌ఎంసీ అర్బన్‌ బయో డైవర్శిటీ విభాగం తీర్చిదిద్దింది. నగర వాసులకు ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలను పెంపొందించడం ఈ పార్కు ముఖ్య ఉద్దేశం.

శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలోని సైబర్‌ టవర్స్‌ సమీపంలో పత్రికానగర్‌లో దాదాపు 1.25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.2కోట్ల వ్యయంతో ‘ ఇంటరాక్టివ్‌ సైన్స్‌ పార్కు’ను తీర్చిదిద్దారు.

ఈ పార్క్‌లో కూర్చోని ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. పార్క్‌లో వర్క్ చేసుకోవాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా ల్యాప్‌టాప్ పెట్టుకోవడానికి బెంచీలు ఏర్పాటు చేశారు. ఆఫీస్ క్యాబిన్లలో ఉండే టేబుల్ తరహాలో ఈ బెంచీలను నిర్మించారు. ల్యాప్‌టాప్ బెంచీ మీద పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడానికి మరో చిన్న బెంచీ ఏర్పాటు చేశారు. ఎంతో సౌకర్యవంతంగా ఉండే వీటిని ఉపయోగించుకుని పార్క్ నుంచే ఆఫీస్ పని చేసుకోవచ్చు. వాష్ రూమ్స్, ఫుడ్ క్యాంటీన్లు కూడా ఈ పార్క్‌లో ఏర్పాటు చేశారు.

ఇంటరాక్టివ్‌ సైన్స్‌ పార్కులో ఓపెన్‌ జిమ్‌తో పాటు పిల్లలకు ప్రత్యేకంగా ఆట స్థలం ఏర్పాటు చేశారు. సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులకు ర్యాంప్‌లు, నడక మార్గాలు ఏర్పాటు చేశారు. సేద తీరేలా గెజిబోలు, సొగసైన సీటింగ్‌ ఏర్పాట్లు ఉన్నాయి. ఎటూ చూసినా.. పచ్చదనం, పార్కు చుట్టూ ఐటీ కంపెనీలు, హాస్టళ్లు, గెస్ట్‌ హౌజ్‌లు, ఆసుపత్రులు, రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్లు ఉండటంతో పాటు ప్రత్యేకంగా హాస్టళ్లలో ఎక్కువగా ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు వీలుగా ఈ పార్కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది.

పిల్లలు,టెక్కీల కోసం రూపొందించిన ఇంటరాక్టివ్ సైన్స్ పార్కు గురించి జిహెచ్‌ఎంసి అర్బన్ బయో డైవర్సిటీ అదనపు కమిషనర్ వి. కృష్ణ సోమవారం ట్వీట్ చేశారు. త్వరలో ఈ పార్కును ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles