24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

సైబర్ క్రైమ్‌పై పోరాటంలో ప్రజలను భాగస్వాములు కావాలి…పోలీసులు!

హైదరాబాద్: సమాజంలోని అన్ని వర్గాలు సైబర్ క్రైమ్ బారినపడి  మోసపోతున్న సందర్భాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో సైబర్ మోసగాళ్ళను అరికట్టడంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి రాష్ట్ర పోలీసులు నడుంబిగించారు.

సైబర్ క్రైమ్‌కు వ్యతిరేకంగా పోరాటంలో పౌరులను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) ఇప్పుడు ప్రజలను అనుమానాస్పద లింక్‌లు లేదా అప్లికేషన్‌లకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. సైబర్ నేరస్థుల కార్యకలాపాలకు సంబంధించిన అన్ని వివరాలను క్రోడీకరించడానికి త్వరలో ఒక రిజిస్ట్రీ కూడా తెరవబోతున్నారు.

ఇందుకు సంబంధించి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో తమ వాట్సాప్ నంబర్ 87126-72222ను పరిచయం చేసింది. ఈ నంబరకు సైబర్ మోసగాళ్ల ఇమెయిల్ చిరునామా, మొబైల్ అప్లికేషన్‌లు, URL లింక్‌లు, ఫోన్ నంబర్ మొదలైన వివరాలను పంపవచ్చని సూచించింది.

“రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) వద్ద సైబర్ మోసగాళ్ల రిజిస్ట్రీ కూడా నిర్వహిస్తారు. ఇందులో పౌరులు పంపింన సమాచారం, ధృవీకరణ తర్వాత, నమోదు చేస్తారు. తదుపరి తీసుకునే చర్యలు సైతం పర్యవేక్షిస్తారు. ఇలాంటి మోసాలపై సాధారణ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ రిజిస్ట్రీ పోలీసులకు సహాయపడుతుంది. తద్వారా ఈ మోసాలను అరికట్టగలం”అని TSCSB SP రఘువీర్ అన్నారు.

ఏదైనా హెచ్చరికలు లేదా సమాచారాన్ని స్వీకరించిన తర్వాత, సైబర్ క్రైమ్ అధికారుల బృందం అటువంటి లింక్‌లు లేదా నంబర్‌లను తీసివేయడానికి లేదా బ్లాక్ చేయడానికి పని మొదలెడతారు. తద్వారా మోసగాళ్ళు… ప్రజలకు మరింత  నష్టాన్ని కలిగించకుండా ఆపుతారు. మరొక బృందం అటువంటి మోసాలకు పాల్పడే నిందితులను గుర్తించడానికి పని చేస్తుంది. వీరి వివరాలను ఫీల్డ్ ఆఫీసర్లకు అందజేసి వారిని గుర్తించి అరెస్టు చేస్తుంది.

“మేము  ప్రజల నుండి సగటున రోజుకు 20 పిర్యాదులను స్వీకరిస్తున్నాం. వీటిపై మా బృందాలు  అంకితభావంతో అనుసరించి… చర్యలను తీసుకుంటున్నాయని” ఆ పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నాడు. వీటిలో లోన్ యాప్‌లు, పెట్టుబడి మోసం యాప్‌లు, ఫ్రెండ్‌షిప్ రాకెట్‌లు, నకిలీ జాబ్ పోర్టల్‌లకు సంబంధించిన పిర్యాదులే ఎక్కువగా ఉంటున్నాయి. .

ఒక వేళ మీరు మోసానికి గురి కాకపోయినా, ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు హానికరమైన లింక్‌లు కనిపిస్తే వాటి గురించి తెలియజేయాలని TSCSB అధికారులు ప్రజలను కోరారు. అటువంటి సమాచారం సకాలంలో మాకు అందితే  ప్రజలు బాధితులుగా మారకుండా నిరోధించవచ్చని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) ప్రజలను అభ్యర్థించింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles