33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

మసీదులో డయాలసిస్ సెంటర్‌ను సందర్శించిన చిల్కూరు పూజారి!

హైదరాబాద్: లంగర్ హౌజ్‌లోని మస్జిద్ మొహమ్మదియాలో ఏర్పాటు చేసిన ఉచిత డయాలసిస్ కేంద్రం.. మత సామరస్యాన్ని ఎలా పెంపొందించవచ్చనడానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది.  వివిధ స్వచ్ఛంద సంస్థలు, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, SEED-USA ఆధ్వర్యంలో గత ఏడాదిలో కులమతాలకు అతీతంగా ఈ సెంటర్ 4758 మందికి ఉచిత డయాలసిస్‌ను అందించింది. ఇందులో పనిచేసే  డయాలసిస్ టెక్నీషియన్లు, నర్సులు, పారామెడిక్స్ , హౌస్ కీపింగ్ సిబ్బంది అందరూ హిందువులే కావడం విశేషం.

హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్-SEED, 10 డయాలసిస్ మెషీన్‌లతో  ఈ సెంటర్‌ను గత ఏడాది జులైలో ఏర్పాటు చేసింది. దాతలు వీటిని తమ ప్రియమైన వ్యక్తి జ్ఞాపకార్థం విరాళంగా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఉచిత డయాలసిస్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ మాట్లాడుతూ… కులమతాలకతీతంగా ఈ డయాలసిస్ సెంటర్ నిర్వహిస్తున్న కార్యకలాపాలు సర్వ మానవ సౌభ్రాతృత్వం, సామరస్యం, గౌరవం, ప్రేమకు అద్దం పట్టిందని, హైదరాబాద్‌లో కనిపించే గంగా-జమునా తహజీబ్‌కు ఇది ఓ ఉదాహరణ అని, దీన్ని ప్రతిఒక్కరూ అనుసరించాలని కొనియాడారు.

సెంటర్‌లోని చీఫ్ టెక్నీషియన్ బి వెంకటేష్ మాట్లాడుతూ, వివిధ వర్గాల రోగులకు సేవ చేయడంలో హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ పాటిస్తున్న  మానవతా విలువల కారణంగా మేము ఈ సెంటర్‌లో చేరామని చెప్పారు. ఇక్కడ పని చేయడం మాకు ఏ ఒక్కరోజు కూడా అసౌకర్యంగా అనిపించలేదు. సరైన పరిశుభ్రత, పరికరాలు, వినియోగ వస్తువుల స్టెరిలైజేషన్ నాణ్యత తక్కువగా ఉంటే సాధారణంగా రోగులు HIV, హెపటైటిస్ C & B ఇన్‌ఫెక్షన్‌లకు గురవుతారు. కానీ ఈ కేంద్రంలో మరణాలు అసలు లేనేలేవు. ఇన్ఫెక్షన్‌ల ప్రభావం జీరో కావడం విశేషం.

రోగికి రూపాయి ఖర్చు లేకుండా  ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్‌తో సమానంగా హై క్వాలిటీ డయాలసిస్ కేర్‌ను అందించాలనేది మా ఆలోచన. తద్వారా పేద రోగులకు ఇప్పటికే రూ. 1.5 కోట్ల ఆదా చేసుకో గలిగారని… ప్రాజెక్ట్‌లో భాగస్వామి అయిన సీడ్-USAకి చెందిన సయ్యద్ మజారుద్దీన్ హుస్సేన్ అన్నారు.

మెడికల్ టూరిస్ట్‌గా భారతదేశాన్ని సందర్శించే అనేక మంది ఎన్‌ఆర్‌ఐలు మా సెంటర్‌లోని సేవలను ఉపయోగించుకున్నారు. మా కేంద్రంలో డయాలసిస్ చేయించుకుంటున్న ఇద్దరు రోగులు ఇప్పుడు మూత్రపిండ మార్పిడికి వరుసలో ఉన్నారు.

హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్‌కు చెందిన ముజ్తబా హసన్ అస్కారీ, హెచ్‌హెచ్‌ఎఫ్-సీడ్ ఉచిత డయాలసిస్ సెంటర్ కూడా, సికెడి రోగులకు పాలియేటివ్ నెఫ్రాలజీపై కౌన్సెలింగ్ ఇవ్వనుందని చెప్పారు. అంతేకాదు ఒత్తిడి, జీవనశైలి మార్పులు, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయాలపై సమగ్ర సూచనలు ఇచ్చేందుకు  పాలియేటివ్ కేర్ కన్సల్టెంట్ డాక్టర్ అంజనా సూరత్‌ అందుబాటులో ఉంటారని ప్రకటించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles