33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘గమ్యం’ పేరిట బస్ ట్రాకింగ్ యాప్ లాంచ్ చేసిన టీఎస్ఆర్టీసీ!

హైదరాబాద్: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ప్రజా రవాణాను మరింత సౌకర్యంగా మార్చేందుకు అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త బస్ ట్రాకింగ్ యాప్ ‘గమ్యం’ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ బస్టాండ్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిన్న ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ…బస్సు రాక కోసం ఇకపై వేచి ఉండాల్సిన అవసరం లేదని, ఈ యాప్ RTC బస్సు తమ స్థానానికి చేరుకోవడానికి పట్టే సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేస్తుందని అన్నారు.  ఆర్టీసీకి చెందిన 4,170 బస్సులకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించినట్లు ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్‌లోని పుష్పక్, మెట్రో సర్వీస్ లకు కూడా ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు సజ్జనార్ వెల్లడించారు. అదే విధంగా జిల్లాలో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ వివరించారు. ఈ యాప్‌లో కేవలం బస్ ట్రాకింగ్ సదుపాయమే కాకుండా మహిళల భద్రత కోసం కూడా పలు అత్యాధునిక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. డయల్ 100, 108కు కూడా ఈ యాప్ ను అనుసంధానం చేసినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు.

మహిళా భద్రతకు ‘ప్లాగ్ ఎ బస్’ ఫీచర్

మహిళా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తోన్న టీఎస్ఆర్టీసీ.. వారి సౌకర్యార్థం గమ్యం యాప్ లో ‘ప్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాత్రి వేళల్లో బస్టాప్ లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ప్లాగ్ ఏ బస్ ఫీచర్ బస్ అందుబాటులో ఉంటుంది. యాప్ లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ పై ఆటోమేటిక్ గా గ్రీన్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్ ను డ్రైవర్ వైపునకు చూపించగానే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో sos బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ను సంప్రదించే సదుపాయం ఉంది.

‘TSRTC Gamyam’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ tsrtc.telangana.gov.in నుంచి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉచితంగా యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles