Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

దేశంలో 8.7 కోట్ల మంది యువతకు చదువు, ఉద్యోగం లేదు…నీతి ఆయోగ్‌!

Share It:

న్యూఢిల్లీ: దేశంలో 8.7 కోట్ల మంది యువత చదువు, ఉద్యోగం లేకుండా ఉన్నారని… నీతి ఆయోగ్ ‘రీఇమాజినింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ @2047’ నివేదికలో వెల్లడించింది. వీరిలో 88 శాతం మంది ఇంటి పనులకే పరిమితమై ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. 2021లో నిర్వహించిన 78వ విడత జాతీయ నమూనా సర్వేలోని డేటా ఆధారంగా ఈ అంచనా రూపొందించారు. కాగా, ఈవిషయం దేశ శ్రామిక శక్తికి ఒక పెద్ద సవాలుగా నిలుస్తోంది. అంతేకాదు విద్య, శిక్షణ లభ్యత, అలాగే శ్రామిక శక్తిలో ప్రవేశించడానికి లేదా తిరిగి చేరడానికి గల అవకాశాలపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ప్రజల విద్య, వృత్తి జీవితంలోని వివిధ దశలను గుర్తించే ఒక కొత్త నైపుణ్య శిక్షణా చట్రాన్ని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. ఇది ఐదు రకాల సమూహాలను గుర్తించింది. వీరిలో పాఠశాల విద్యార్థులు, ఉన్నత విద్యలో ఉన్నవారు, అధికారిక, అనధికారిక కార్మికులు, విద్య, ఉపాధి, శిక్షణకు వెలుపల ఉన్నవారు, మహిళలు ఉన్నారు.

జీవితకాల నైపుణ్యాభివృద్ధి నమూనాకు నీతి ఆయోగ్ ప్రోత్సహం
భారతదేశ నైపుణ్యాభివృద్ధి వ్యవస్థ కేవలం ‘పాఠశాల నుండి ఉద్యోగానికి’ అనే నమూనా నుండి వైదొలగాలని నీతిఆయోగ్‌ చెబుతోంది. దానికి బదులుగా, ప్రజలు తమ జీవితాంతం విద్య, శిక్షణ పొందుతూ ఉండాలని సూచించింది. అందుకు అనుగుణంగా విద్యార్థులకు చిన్నతనం నుంచే ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను అందించాలని, ఉపాధి సామర్థ్యాలను తీర్చిదిద్దడాన్ని పాఠశాల వ్యవస్థలో అంతర్భాగ చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. దీనికి గాను 6వ తరగతి నుంచే ఉపాధి నైపుణ్యాల శిక్షణను ప్రారంభించాలని, 9వ తరగతి నుంచి క్రమబద్ధమైన వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది.

అలాగే 11, 12వ తరగతులలోని విద్యార్థులు అందరికీ ‘సాధారణ ఉపాధి, వ్యవస్థాపక నైపుణ్యాల’ను ప్రత్యేక సబ్జెక్టుగా కొనసాగించాలని సూచించింది. ’10, 12 తరగతులలో వృత్తివిద్య సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యత లభించేలా విద్యా మండళ్ల పథకాలను సవరించాలి. పదో తరగతిలో బోర్డు సర్టిఫికేషన్ ను ఆమోదించేలా రాష్ట్ర విద్యా మండళ్ల పథకాలను సవరించాలి’ అని నీతి ఆయోగ్ తెలిపింది. ప్రతిపాదిత విధానాన్ని అమలు చేయడంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి,ఉపాధి వ్యవస్థలను స్థానిక కార్మిక మార్కెట్లు, జిల్లా స్థాయి అవసరాలకు అనుగుణంగా మార్చాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది.

ఈమేరకు నైపుణ్యాభివృద్ధి నిర్మాణంలో సమీకృత పథకం కింద, 2027 ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం రూ. 600 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాంలలో రాష్ట్ర నైపుణ్య పరివర్తన పైలట్ ప్రాజెక్టులను ప్రతిపాదించారు.

భారతదేశ నైపుణ్య శిక్షణా వ్యవస్థను మరింత సరళంగా మార్చడం, దానిని వాస్తవ ఉపాధి అవకాశాలతో సన్నిహితంగా అనుసంధానించడమే ఈ ప్రతిపాదిత సంస్కరణల లక్ష్యమని నీతి ఆయోగ్‌ తెలిపింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.