23.7 C
Hyderabad
Monday, September 30, 2024

పాతబస్తీ మెట్రో పనుల కోసం డ్రోన్ సర్వే ప్రారంభం!

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పాతబస్తీలో మెట్రో రైలు సన్నాహక పనులు వేగవంతం అయ్యాయి. ఇందులో భాగంగా మెట్రో రైలు అలైన్‌మెంట్, ప్రభావిత ఆస్తులు తదితరాలపై డ్రోన్ సర్వేను హెచ్‌ఎంఆర్‌ఎల్ చేపట్టింది. ఈ సర్వే అనంతరం మెట్రో స్తంభాల పునాదుల కోసం ‘భూసామర్ధ్య పరీక్షల’ను  త్వరలో ప్రారంభించనున్నట్టు మెట్రో ఎండీ తెలిపారు.

దారుల్-షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మధ్య ఇరుకైన మార్గంలో రహదారి విస్తరణతో పాటు మెట్రో స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన స్థలం కోసం కచ్చితమైన కొలతలు తీసుకోవడానికి అధికారులు డ్రోన్ సర్వే చేశారు.

ఈ మెట్రో నిర్మాణంలో భాగంగా 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ ఖానాలు, 33 దర్గాలు, 7 సమాధి యార్డులు, 6 చిల్లాలతో సహా దాదాపు 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయని వీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెట్రో నిర్మాణం చేపట్టడం ప్రధాన సవాల్‌గా మారిందన్నారు. మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలను రక్షించడానికి తగిన ఇంజనీరింగ్ పరిష్కారాలను రూపొందించడంలో డ్రోన్ సర్వే సహాయపడుతుందన్నారు.

డ్రోన్ సర్వే ద్వారా రియల్ టైమ్ డేటా, హై రిజల్యూషన్ ఇమేజరీ 3డీ మోడలింగ్, జిఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) డేటా, సిఏడి సాఫ్ట్‌వేర్ ఏకీకరణ, డేటా విశ్లేషణ, విజువలైజేషన్ త్వరితగతిన సేకరించవచ్చని ఎండి పేర్కొ న్నారు. దీంతోపాటు రానున్న రోజుల్లో భూసామర్ధ్య పరీక్షలు ప్రారంభించడానికి టెండర్లు కూడా ఖరారు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఫలక్‌నుమా మెట్రో స్టేషన్ ఉన్న ఫలక్‌నుమా వైపునుంచి భూసామర్ధ్య పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటికే ఉన్న ఎంజిబిఎస్ నుంచి కాకుండా, పాత నగరంలో 5.5 కి.మీ మెట్రో మార్గంలో సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్ (మెట్రో స్టేషన్లు ఈ రెండు చారిత్రక మందిరాలకు 500 మీటర్ల దూరంలో), శాలిబండ, ఫలక్‌నుమాతో కలిపి 4 స్టేషన్లు ఉంటాయని ఆయన తెలిపారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles