ఇటావా, యూపీ: దేశం ఎదుర్కొంటున్న “అతిపెద్ద సంక్షోభం” బీజేపీయేనని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అభివర్ణించారు. విద్వేషాన్ని వ్యాప్తి చేయడం తప్ప అధికార పార్టీకి మరో అజెండా లేదని ఆయన ఆరోపించారు.
రక్షాబంధన్ సందర్భంగా ఇటావా జిల్లాలోని తన స్వగ్రామంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “దేశంలో ఒకే ఒక సంక్షోభం ఉంది, అది బీజేపీ. బీజేపీ వెళ్ళిపోతే, సంక్షోభం కూడా పోతుందని” ఆయన అన్నారు.
సోషలిస్ట్ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ వారసత్వాన్ని ఆ పార్టీ ‘అమ్ముకుంటోందని, ‘బీజేపీ ఏర్పడినప్పుడు, తమను తాము సోషలిస్ట్ పార్టీగా చూపించుకునే ప్రయత్నంలో నారాయణ్ ఫోటోను ప్రదర్శించిందని, కానీ ఇప్పుడు జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ (JPNIC)ను ‘అమ్మేసిందని’ ఆయన అన్నారు. “బీజేపీని కొనడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు; లేకపోతే, బీజేపీయే తనను తాను అమ్ముకునేది,” అని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు.
ద్రవ్యోల్బణంపై ఎస్పీ అధినేత మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం నిత్యావసర వస్తువులు, ఇంధనం ధరలను పెరగనిస్తోందని ఆరోపించారు. “చక్కెర విషయానికి వస్తే, అది ఖరీదైపోయింది. ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతోంది. కల్తీని నియంత్రించే చట్టం ఉంది; చట్ట ప్రకారం కల్తీ చేయడానికి వీల్లేదు. కానీ, కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికి, ఎన్నికల విరాళాలు రాబట్టుకోవడానికి పకడ్బందీగా పన్నిన వ్యూహంలో భాగంగా, లాభాలు గడించడానికి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది,” అని ఆయన ఆరోపించారు.
కంపెనీలు లాభాలు ఆర్జించేందుకు వీలుగా చక్కెర, డీజిల్, పెట్రోల్లను అధిక ధరలకు అమ్ముతున్నారని, ప్రభుత్వ విధానాల వల్లే ద్రవ్యోల్బణం పెరుగుతోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
మందులను అధిక ధరలకు అమ్ముతున్నారని, అంబులెన్సులు సరిగ్గా పనిచేయడం లేదని, పోలీసు సిబ్బంది ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణానికి ఉద్దేశించిన నిధులను దుర్వినియోగం చేశారని యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎందుకు జవాబుదారీగా ఉంచడం లేదని ప్రశ్నించారు.
ప్రశ్నలు అడగడమంటే భయపడే బీజేపీ, ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను బలహీనపరుస్తోందని విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల గౌరవానికి, రక్షణకు మరియు వారి మెరుగైన ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు

