23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

 గవర్నర్‌ పదవికి తమిళిసై సౌందరరాజన్‌ అనర్హులు…మంత్రి కేటీఆర్‌!

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి అనర్హులని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను తమిళిసై తిరస్కరించడాన్ని ఆక్షేపించారు.

అయినా దేశంలో గవర్నర్ పోస్ట్ అవసరమా? అని ప్రశ్నించారు. మొన్నటి వరకు గవర్నర్ కూడా ఓ రాష్ట్రానికి బీజేపీ ప్రెసిడెంటే కదా? అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులకు రాజకీయ పార్టీలతో సంబంధం ఉంటే తప్పేంటి అని నిలదీశారు. దాసోజు శ్రవణ్ ప్రజాఉద్యమాల్లో ఉన్నారని, కుర్రా సత్యనారాయణ ట్రేడ్ యూనియన్ నేతగా జాతీయ స్థాయిలో పని చేశారని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నారని ప్రతిపాదన తిరస్కరిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు రాజకీయ పార్టీతో సంబంధం లేదా? మోదీ ఏజెంట్‌‌లు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయినా బలహీన వర్గాల నేతలను కౌన్సిల్‌కు పంపితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని తమిళిసైను ప్రశ్నించారు.

క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వారిని గవర్నర్లుగా నియమించరాదని సర్కారియా కమిషన్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని బీఆర్‌ఎస్ నేత గుర్తు చేశారు. ‘ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఎవరెవరు అనర్హులు అనేది ప్రజాకోర్టులో తేలుతుంది’’ అని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేసేందుకు గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ఈ పదవిని వలసరాజ్యంగా పేర్కొంటూ, భారత ప్రజాస్వామ్యానికి ఈ పదవి అవసరమా అనే చర్చ జరగాలని అన్నారు. మంత్రివర్గం మరోసారి రెండు నామినేషన్లను గవర్నర్‌కు పంపుతుందా అని అడిగినప్పుడు “మేము సాధ్యమైన అన్ని మార్గాలను అన్వేషిస్తాము” అని ఆయన చెప్పారు.

ఇటీవల ఉత్తరప్రదేశ్,ఇతర రాష్ట్రాల్లో శాసనమండలికి నామినేట్ అయిన పలువురు రాజకీయ నాయకుల పేర్లను కేటీఆర్ చదివి వినిపించారు. బీజేపీలోకి ఫిరాయించిన వెంటనే జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభకు నామినేట్ అయ్యారని ఆయన సూచించారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా, తన నియోజకవర్గంలో ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తి చేయలేని అత్యంత అసమర్ధుడు మంత్రి కిషన్‌రెడ్డి అని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి. అతని గురించి మాట్లాడటం వృధా,” అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles