33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

హైదరాబాద్​కు ఈసీ బృందం.. ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఓటర్ల జాబితా, ఈవీఎంల సన్నద్ధం, అధికారులకు శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రానున్న వారం, పది రోజుల్లోపు ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికల సన్నాహకాలను సమీక్షించనుంది. ఇందుకోసం నేటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం మూడ్రోజులపాటు హైదరాబాద్ లో పర్యటించనుంది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవకుమార్  నేతృత్వంలోని ఈసీ బృందం.. ఎన్నికల ఏర్పాట్లు, సన్నాహకాలు పర్యవేక్షించనుంది. కొందరు సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకొన్నారు. సీఈసీ సహా ఇతర కమిషనర్లు.. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. గుర్తింపు పొందిన 10 రాజకీయ పార్టీల ప్రతినిధులతో బృందం సమావేశమవుతుంది. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి వారి నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించనుంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో సమావేశం కానున్న సీఈసీ… ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఉచిత కానుకలకి అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపడుతోంది. ఆ దిశగా ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో కలిసి.. రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందాలు ఏర్పాటుచేశారు. ఎన్నికల్లో అధికంగా -వ్యయం చేసే అవకాశం ఉన్న నియోజకవర్గాలు గుర్తించి.. వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టనున్నారు. అందుకు సంబంధించిన అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ అధికారులతో ఈసీ (CEC) బృందం చర్చించనుంది.

అసెంబ్లీ ఎన్నికలకి చేస్తున్న ఏర్పాట్లు, ప్రణాళికలను ఉన్నతాధికారులు వివరించనున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాల నోడల్ అధికారులు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. రెండో రోజు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం కానున్న ఈసీ బృందం.. జిల్లాల వారీగా ఎన్నికల ప్రణాళికలు, పరిస్థితులు, ఏర్పాట్లు సమీక్షించనుంది. మూడో రోజు దివ్యాంగ ఓటర్లు, ఇతర వర్గాల ఓటర్లతో సమావేశంకానున్నారు.

ఎన్నికల సన్నద్ధతపై చర్చించేందుకు ఈ బృందం తదనంతరం చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అంజనీ కుమార్‌లతో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది.  సీఈసీ, ఇతర కమిషనర్లు విలేకరుల సమావేశంతో పర్యటనను ముగించనున్నారు.

పర్యటన తర్వాత వారం లేదా 10 రోజుల తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles