24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘అన్నారం’ సరస్వతి బ్యారేజీలోని రెండు గేట్ల వద్ద నీటి లీకేజీ!

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటన మరవక ముందే కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మరో లోపం బయటపడింది. ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం వద్ద నిర్మించిన సరస్వతి బ్యారేజీలోని రెండు గేట్ల వద్ద  లీకేజీతో నీరు ఉబికి వస్తోంది. బ్యారేజీలో 38 నుంచి 40 పిల్లర్ల మధ్య ప్రాజెక్టు‌కు బుంగ ఏర్పడినట్లు తెలిసింది. వరద నీరు విడుదలయ్యే ప్రదేశంలో అడుగు నుండి నీరు పైకి ఉబికి వస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. బుడగలు వచ్చే ప్రదేశంలో ఇసుక, మెటల్ నింపిన సంచులను వేయిస్తున్నారు.

ఇసుక బస్తాలు వేయడంతో నీటి అలలు ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో బయటపడ్డాయి. రెండు రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని స్థానిక సమాచారం. ఈ ఊటలతో పాటు నీటిలోని ఇసుక ఉబికి పైకివస్తే ప్రమాదమని అధికారులు భావిస్తున్నారు.   కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా అన్నారం సరస్వతి బ్యారేజీని నిర్మించారు. ప్రస్తుతం ఇందులో 10.87 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కాగా, లీకేజీపై తెలంగాణ బీజేపీ యూనిట్ ట్వీట్ చేసింది. “కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం బ్యారేజీలో లీకేజీలు. గేట్ నంబర్లు 28, 38లో లీకేజీలు.. లీకేజీలను అడ్డుకునేందుకు ఇంజినీర్లు ఇసుక బస్తాలను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం అన్నారం బ్యారేజీలో 5.61 టీఎంసీల నీరు ఉంది. ఒక గేటు తెరిచి 2357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

అక్టోబర్ 22న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్ రెండు ఫీట్ల మేర కుంగిపోయిన సంగతి తెలిసిందే. కేంద్ర బృందం కూడా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించింది. పిల్లర్లు కుంగిపోవటంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రూ. లక్షకోట్ల ప్రజాధనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే.. తాజాగా సరస్వతి బ్యారేజీలోనూ లీకేజీ బయటపడం కలకలం రేపుతోంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles