23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

జ్ఞానవాపీ మసీదు – కాశీ విశ్వేశ్వర మందిర వివాదం…1991 ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టమే పరిష్కారం!

నేడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల్లో జ్ఞానవాపీ మసీదు సమస్య కూడా ఒకటన్నది మనందరికీ తెలిసినదే. ఇది చాలా పాత సమస్య, కాకపోతే ఈ మధ్యకాలంలో రామ మందిర ప్రారంభోత్సవంతో ఉత్తేజితులైన అంధ భక్తులు దీన్ని కావాలనే పదే పదే ప్రస్తవిస్తున్నారు.

చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నత్త నడకకు ప్రసిద్ధికెక్కిన న్యాయవ్యవస్థ కానివ్వండి .. ప్రభుత్వ వ్యవస్థలు కానివ్వండి ఈ విషయంలో మాత్రం ఎన్నడూ లేనంతగా శీఘ్రగతిన పనిచేయడం అందరినీ విస్తు గొలుపుతుంది. ఒకవైపు న్యాయస్థానం చకచకా విచారణ జరపడమే కాక మరోవైపు ఏఎస్ఐ రిపోర్టుపై తగినంత వాదోపవాదాలు జరుపకముందే ఒక అడుగు ముందుకేసి జ్ఞానవాపీ మసీదు సెల్లార్లో గత నెల 31న పూజకు అనుమతించి, అదే రోజు పోలీస్ కమిషనర్, జిల్లా న్యాయమూర్తి ఏకమై జిల్లా కోర్టు తీర్పును రాత్రికి రాత్రే అమలుపరిచి ఓ నూతన చరిత్రకు నాందిపలికారు.

అనూహ్యమైన జిల్లా కోర్టు తీర్పుతో ఏకీభవించని మసీదు కమిటీ న్యాయం కోసం అత్యున్నత న్యాయస్థానం తలుపులు తడితే, అది ఇక్కడ కుదరదు హైకోర్టుకు పొమ్మన్నది. హైకోర్టు ఏమో పూజలు ఆపాలన్న మసీదు కమిటీ కోరికను మన్నించకుండా సెల్లార్లో జరుగుతున్న పూజా కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం కలగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంటే ఇక్కడ చరిత్ర మరోసారి పునరావృతం కాబోతుందని తెలుస్తుంది. బాబ్రీ మసీదు విషయంలో కూడా ఇదే జరిగింది. 38 ఏళ్ల క్రితం ఫైజాబాద్ జిల్లా కోర్టు కూడా ఇదే విధంగా బాబ్రీ మసీదు కేసులో 1986 ఫిబ్రవరి ఒకటవ తేదీన భక్తుల సందర్శనార్థం బాబ్రీ మసీదు తలుపులు వెంటనే తెరువ వలసిందిగా ఆజ్ఞాపించి, నాడు అలా బాబ్రీ మసీదు తలుపులు తెరవడం వల్ల ఆ మసీదును హిందువులు హస్తగతం చేసుకోవడానికి మార్గం ఎలాగైతే సుగమం అయ్యిందో, నేడు అదే విధంగా జ్ఞానవాపి మసీదులో పూజకు అనుమతించి, కోర్టు దీన్ని కూడా హిందువులు సునాయాసంగా హస్త గతం చేసుకోవడానికి మార్గం సుగమం చేసిందని చెప్పాల్సి ఉంటుంది.

మరో విషయం ఏమిటంటే బాబ్రీ మసీదుకు సంబంధించిన ప్రతిపక్ష వాదనలో, జ్ఞానవాపీ మసీదుకు సంబంధించిన ప్రతిపక్ష వాదనలో చాలా సారూప్యత ఉంది. బాబ్రీ మసీదు విషయంలో ప్రతిపక్ష వాదనను ఏ విధంగానయితే చారిత్రక సాక్షాధారాలు బలపరచలేదో అదేవిధంగా ఈ మసీదు విషయంలో కూడా ప్రతిపక్ష వాదనను చారిత్రక సాక్షాధారాలు బలపరచడం లేదు.

ఈ విషయాన్ని మనం చరిత్ర నిపుణురాలు అయినా డాక్టర్ రుచికా శర్మ మాటల్లో బాగా అర్థం చేసుకోగలం. ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ… సత్యాసత్యాలు ఏమిటన్న సంగతిని చారిత్రక సాక్షాధారాలతో చక్కగా తెలియజేశారు. దానిని ఇక్కడ సత్యాన్వేషణాపరుల కోసం క్రింద పొందుపరస్తున్నాం.

ఆమె చెప్పిన మొదటి చారిత్రక సాక్ష్యం : అక్బర్ చక్రవర్తి కాలంలో మాన్సింగ్ అనే మన్సబ్ధార్, అక్బర్ అనుమతితో కాశీ విశ్వేశ్వర మందిరాన్ని నిర్మింప చేశాడని అబుల్ ఫజల్ రాసిన అక్బర్ నామా ద్వారా తెలుస్తుంది తప్ప, అంతకు ముందు కూడా దీనికి ఓ చరిత్ర ఉన్నట్లు ఎలాంటి చారిత్రక సాక్షాధారాలు లేవు.

రెండవ చారిత్రక సాక్ష్యం : ఈ మందిరాన్ని ఔరంగాజేబు కాలంలో ఆయన ఆజ్ఞానుసారం 1669 లో కూలగొట్టింది కూడా నిజం. మాసిర్ ఎ ఆలంగీర్ అనే పుస్తకం ద్వారా తెలిసిందేమిటంటే, 1669వ సంవత్సరంలో ఈ మందిరాన్ని మతపరమైన విద్వేషంతో కాకుండా రాజకీయ ఉద్దేశంతో ధ్వంసం చేయడం జరిగిందని తెలుస్తుంది. ఎందుకంటే మాన్సింగ్ మనవడు అయినా జై సింగ్ తిరుగుబాటు జెండా ఎగురవేస్తూ, శివాజీని ఆగ్రా నుండి పారిపోవడంలో సహకరించాడనే కోపంతో అతనికి ఓ హెచ్చరిక జారీ చేయడానికి ఔరంగజేబు ఈ మందిరాన్ని కూలగొట్టించాడని తెలుస్తుంది.

మూడవ చారిత్రక సాక్ష్యం, మాసిర్ ఎ ఆలంగీర్ ద్వారా తెలిసిన మూడవ విషయం ఏమిటంటే ఔరంగజేబు విశ్వేశ్వర మందిరాన్ని కూల్చడానికి ఆజ్ఞాపించాడు తప్ప దాని అవశేషాల మీద ఓ మసీదును కట్టవలసిందిగా ఆజ్ఞాపించలేదు. మరి అలాంటప్పుడు దాని అవశేషాల మీదనే ఈ మసీదు నిర్మించబడిందని అలాగే దాని అవశేషాలతోనే దాని నిర్మాణం జరిగిందన్న వాదనకు కూడా చారిత్రక సాక్ష్యం బలపరచడం లేదు. నాలుగవ చారిత్రక సాక్ష్యం ఏమిటంటే ఆ మసీదులో కనబడే వివిధ చిహ్నాలు ఆ కాలపు పద్ధతి ప్రకారం నాటి మేస్త్రీలు, గోడలపై మరియు స్తంభాలపై చెక్కిన చిహ్నాలుగా పరిగణించాలి తప్ప ఇతర మందిరాల అవశేషాలతో ఈ మసీదు నిర్మించారని భావించరాదని ఆమె గట్టిగా వాదించడం జరిగింది.

పైన పేర్కొన్న చారిత్రక సాక్షాదారాలు, విశ్వేశ్వర మందిరాన్ని కూల్చి జ్ఞానవాపి మసీదు కట్టారన్న వాదనను బలపరచడం లేదని తేలిపోయింది. కనుక హిందూ వాదులు ఇకనైనా తమ డిమాండును ఉపసంహరించుకోవాలని మనవి చేయనైనది.

ఆ మాటకొస్తే వేలాది బౌద్ధ, జైన మందిరాలను కూల్చి హిందూ దేవాలయాలు గా నిర్మితిమయ్యాయని చరిత్ర చెబుతోంది, మరి ఆ దేవాలయాలన్నింటినీ కూల్చి తమకు అప్పజెప్పాలని నేడు బౌద్ధ, జైన సోదరులు డిమాండ్ చేసినట్లయితే హిందూ సోదరులు వారి డిమాండ్ ను నెరవేరుస్తారా?

మరో విషయం ఏమిటంటే 1732 వ సంవత్సరంలో గురు గ్రామ్ హర్యానా లో ఫారుక్ సియర్ నిర్మించిన జామా మసీదు ఎప్పటి నుండో హిందువుల ఆధీనంలో ఉంది. వాళ్లు దీన్ని హిందూ దేవాలయంగా మార్చారు. ఎలాంటి అంతరాయం లేకుండా ఇందులో పూజలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే 14వ శతాబ్దంలో దౌలతాబాద్, ఔరంగాబాద్ మహారాష్ట్రలో నిర్మించబడిన ఓ జామా మసీద్ నేడు హిందువుల ఆక్రమణలో ఉంది. ఇది ఇప్పుడు భారతమాత మందిరంగా పిలవబడుతుంది. ఇందులో కూడా యదేఛ్ఛగా పూజాపురస్కారాలు జరుగుతూనే ఉన్నాయి. 1351 నుండి 1388 మధ్యకాలంలో సోనీ పథ్ హర్యానాలో ఫెరోజ్ షా తుగ్లక్ నిర్మించిన జామా మసీదు కూడా నేడు హిందువుల ఆక్రమణలో ఉంది. ఇది నేడు భగవాన్ దాణా షేర్ మందిరంగా పిలవబడుతుంది. ఇందులో కూడా పూజలు జరుగుతున్నాయి.

నేడు హిందూ సోదరులు బాబ్రీ మసీదు తో పాటు జ్ఞానవాపి మధుర మసీదులను కూడా తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పాండవులు 5 గ్రామాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే మేము కేవలం మూడు మసీదులనే అడుగుతున్నాం కదా. లేనిచో కౌరవ – పాండవుల యుద్ధంలా హిందూ, ముస్లిం యుద్ధం తప్పదు అంటున్నారు.

మరి హిందూ సోదరులు పైన పేర్కొన్న మసీదులతో పాటు వారి కబ్జాలో ఉన్న మిగతా మసీదులు కూడా తిరిగి ముస్లింలకు అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నారా?

  • ఇవన్నీ కాని మాటలు కనుక, 1991 ప్రార్ధనా స్థలాల పరిరక్షణ చట్టం ఒకటే మనకు శరణు అని భావించాలి.
  • 1947 నాటి యధాస్థితిని నిండు మనసుతో కొనసాగనిద్దాం. జాతి సమైక్యతను, శాంతిని కాపాడుదాం.
  • రండి! సంకుచిత భావాలకు స్వస్థి చెబుదాం. ప్రేమానురాగాల పూలను వెదజల్లుదాం.

…యూసుఫ్ అస్కరి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles