24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

మల్లన్నసాగర్‌ ప్రారంభోత్సవం నేడే… జాతికి అంకితం చేయనున్నసీఎం కేసీఆర్‌!

హైదరాబాద్: తెలంగాణలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నేడు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నేడు దీన్ని జాతికి అంకితం చేయనున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధిక ఆయకట్టుకు నీటి సరఫరాతోపాటు తాగు, పారిశ్రామిక అవసరాలకు ఈ రిజర్వాయర్‌ కీలకం కానుంది. భారీ మట్టికట్టతో.. 50 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌ నిర్మించారు. వ్యవసాయ అవసరాలతో పాటు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు. రిజర్వాయర్ మొత్తం స్థాపిత సామర్థ్యం 50 టీఎంసీలు కాగా.. మల్లన్న సాగర్ నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఇటీవలి కాలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ట్రయల్ రన్ ఆలస్యమైంది. ప్రస్తుత సంవత్సరంలో కనీసం 10 టీఎంసీల నీటిని నిల్వ చేసి నల్గొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో సాగునీటికి వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
పంపుహౌస్‌ల పనితీరును పర్యవేక్షించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కింద పనిచేస్తున్న ఇంజినీర్ల బృందాన్ని నియమించారు. అధికారులు గంటల వారీగా నీటి ప్రవాహాన్ని లెక్కిస్తున్నారు. ఫలితాల ఆధారంగా, ఇరిగేషన్ విభాగం తదుపరి ఖరీఫ్ సీజన్‌లో సాగునీటి అవసరాల కోసం నీటి విడుదలపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. 18 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ రిజర్వాయర్ దోహదపడుతుంది. రిజర్వాయర్‌లో 13 కిలోమీటర్ల మేర ఉన్న నీటి అడుగున సొరంగం నీటిని నిరాటంకంగా ఎత్తిపోసేందుకు మార్గం సుగమం చేసింది. దేశంలోనే తొలిసారిగా నదిలేని చోట ప్రాజెక్ట్ నిర్మాణం చేయటం ఒక విశేషమని చెప్పుకోవాలి.
మల్లన్నసాగర్‌ తెలంగాణకు గుండెకాయ. మొత్తం ప్రాజెక్టులోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యమున్న, అత్యంత ఎత్తున ఉన్న జలాశయం ఇదే. సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ మహా జలాశయానికి 5 ఓటీ స్లూయిస్‌లు (తూములు) ఉన్నాయి. ఆ తూముల ద్వారానే కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌కు, సింగూరు ప్రాజెక్టుకు, తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు, మిషన్‌ భగీరథకు నీటిని తరలిస్తారు. మల్లన్నసాగర్‌… ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు ఓ వరప్రదాయిని. ఇది కేవలం మాటల్లో కాదు… కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదికను పరిశీలిస్తే ఇది అక్షర సత్యమని స్పష్టమవుతుంది. భారీ ఎత్తున గోదావరి జలాల్ని ఒడిసి పట్టడమే కాదు.. ఆయకట్టుకు సమానంగా సాగునీటి పంపిణీ జరగాలన్నా, డిమాండు-సరఫరాకు మధ్య వ్యత్యాసాన్ని భారీగా తగ్గించాలన్నా, చివరకు ప్రాజెక్టులో ఎక్కడ కొరత, సమస్య ఏర్పడినా వ్యవస్థ కుప్పకూలకుండా ఆదుకోవాలన్నా… అన్నింటికీ కే్ంద్రబిందువు మల్లన్నసాగర్‌ ప్రాజెక్టే అని చెప్పుకోవాలి. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లో మల్లన్నసాగర్‌ను మదర్‌ రిజర్వాయర్‌గా అభివర్ణించారు.

@అతిపెద్ద రిజర్వాయర్‌
రాష్ట్రంలోనే ఎస్సారెస్పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్నసాగర్‌. దీని కెపాసీటీ 50 టీఎంసీలు. బహుళ ప్రయోజనాలు కలిగిన ఈ జలాశయంతో ఉమ్మడి మెదక్‌తో పాటు ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్‌, నిజాంసాగర్‌, సింగూరు, తపాస్‌పల్లి, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులకు ఇక్కడి నుంచే గోదావరి జలాలను తరలిస్తారు. హైదరాబాద్‌ తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఏడాది పొడవునా అందిస్తారు. శ్రీరాజరాజేశ్వర జాలశయం నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌కు అక్కడి నుంచి ఓపెన్‌ కెనాల్‌, సొరంగం ద్వారా మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాలు వస్తాయి.

మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవంపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తన ఆనందాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు.

‘‘ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కల సాకారమైంది.. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టును పూర్తి చేశాం.. రిజర్వాయర్‌తో కరువు శాశ్వతంగా తరిమికొడుతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles