24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

భారత్‌పై అంతరిక్ష కేంద్రం కూలొచ్చు… ఆంక్షలపై మండిపడ్డ రష్యా స్పేస్ చీఫ్!

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలపై రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ చీఫ్‌ మండిపడ్డారు. అమెరికా కొత్తగా విధించిన ఆంక్షల వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)పై ఇరు దేశాల సహకారం దెబ్బతినే అవకాశమున్నదని అన్నారు. దీని వల్ల స్పేస్‌ స్టేషన్‌ నియంత్రణ కోల్పోతే అమెరికా, ఐరోపా, భారత్‌, చైనా వంటి దేశాలపై అది కూలడం ఖాయం అని హెచ్చరించారు. రష్యాపై ఐఎస్‌ఎస్‌ తిరుగదని, అందువల్ల తమ దేశానికి ఎలాంటి ముప్పు ఉండదన్నారు.
ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడికి పాల్పడిన రష్యాను శిక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం కఠినమైన కొత్త ఆంక్షలను ప్రకటించారు. రష్యాకు సాంకేతిక, అంతరిక్ష, సైనిక రంగాల్లో సహకారంపై పరిమితులు విధించారు. రష్యా బ్యాంకులు, ఆ దేశానికి సహకరించే వ్యక్తులు, సంస్థలపైనా ఆంక్షలు విధించారు.
కాగా, అమెరికా తాజా ఆంక్షలపై రోస్‌కాస్మోస్‌ డైరెక్టర్ జనరల్ డిమిత్రి రోగోజిన్స్ వెంటనే స్పందించారు. దీని వల్ల జరుగనున్న పరిణామాలను హెచ్చరిస్తూ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ చేశారు. ‘మీరు మా సహకారాన్ని అడ్డుకుంటే, ఐఎస్‌ఎస్‌ తన కక్ష్య నుంచి గతి తప్పి అమెరికా లేదా ఐరోపాపై పడితే ఎవరు కాపాడతారు?’ అని ప్రశ్నించారు. సుమారు 500 టన్నుల బరువైన అంతరిక్ష కేంద్రం భాగాలు భారత్‌ లేదా చైనాపై కూడా పడే అవకాశముందని అందులో పేర్కొన్నారు.
అలాంటి అవకాశాలతో మీరు బెదిరించాలనుకుంటున్నారా? అని అమెరికాను రోస్కోస్మోస్ చీఫ్‌ ఘటుగా ప్రశ్నించారు. ‘ఐఎస్‌ఎస్‌ రష్యా మీదుగా ప్రయాణించదు. కాబట్టి అది కూలితే అన్ని నష్టాలు మీకే. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని మరో ట్వీట్‌లో ఆయన వార్నింగ్‌ ఇచ్చారు. అందువల్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించవద్దని అమెరికాకు సూచించారు.
మరోవైపు రష్యాపై విధించిన కొత్త ఆంక్షలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) స్పందించింది. రష్యాతో సంబంధాలకు దీని వల్ల ఎలాంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సురక్షిత ఆపరేషన్ల కోసం రష్యాతోపాటు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి నాసా పని చేస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles