30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

నేలకూలిన శిక్షణా విమానం… మహిళా ట్రైనీ పైలెట్ మృతి!

నల్లగొండ: శిక్షణ విమానం నేలకూలడంతో ట్రైనీ పైలెట్‌ మృతిచెందారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకున్నది. తమిళనాడులోని చెన్నైకి చెందిన మహిమ గజరాజ్‌ (29) నాగార్జునసాగర్‌ సమీపంలో విజయపురి సౌత్‌లోని ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఆరు నెలలుగా పైలెట్‌గా శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో భాగంగా శనివారం ఉదయం 10:40 గంటల సమయంలో మహిమ గజరాజ్‌ బయల్దేరిన సెస్నా 152 ఎయిర్‌క్రాఫ్ట్‌ కాసేపటికే 10:50 గంటలకు పెద్దవూర మండలం తుంగతుర్తి శివారులోని రైతు గార్లపాటి ఈదయ్య బత్తాయి తోటలో నేలకూలింది. ఈ ఘటనలో మహిమ అక్కడికక్కడే మృతిచెందారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ కూలిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఘటన స్థలానికి భారీగా తరలివచ్చారు. విషయం తెలుసుకొన్న నల్లగొండ ఎస్పీ రెమారాజేశ్వరి, మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ సంస్థ ప్రతినిధులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాద కారణాలను తెలుసుకొనేందుకు పోలీస్‌, డీజీసీఐ, ఏవియేషన్‌ సంస్థ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక కారణాలతోనే ప్రమాదం జరిగినట్టుగా అధికారులు భావిస్తున్నారు. అయితే విద్యుత్తు తీగలను తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.                                                    శిక్షణ విమానం ప్రమాదంలో మృతిచెందిన మహిమ గజరాజ్‌ నందికొండ విజయపురి సౌత్‌లోని ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీలో గతేడాది అక్టోబర్‌ 18 నుంచి శిక్షణ తీసుకొంటున్నారు. 6 నెలల కాలానికిగాను 4 నెలల శిక్షణ పూర్తయింది. గతంలో హెలికాప్టర్‌లో లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లిన అనుభవం ఉన్నట్టు ట్రైనింగ్‌ అధికారులు తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles