24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఏపీలో 78 విద్యార్థులకు అస్వస్థత… ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితం!

అమరావతి: కర్నూల్‌/అనంతపూర్‌: ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్న భోజనంలో భాగంగా వడ్డించిన కలుషిత ఆహారం తిన్నందున అనంతపురం,  కర్నూలు జిల్లాలోని రెండు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 78 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల విశ్వనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. అప్రమత్రమైన అధికారులు అస్వస్థతకు గురైన విద్యార్థులను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయించారు. ప్రస్తుతం వారిని చిన్నపిల్లల వార్డులో పర్యవేక్షణలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థులు క్రమంగా కోలుకుంటున్నారన్నారు.
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సంబంధిత అధికారులతో కలిసి పాఠశాల, ఆసుపత్రిని సందర్శించి సంఘటనపై ఆరా తీశారు.  దీనిపై విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆధికారులకు ఆదేశాలిచ్చారు.
సమాచారం అందుకున్న పిల్లల తల్లిదండ్రులు.. ఆస్పత్రికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన తమ పిల్లలను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల అరోగ్యంపై ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందిచాలని వైద్యులకు సూచించారు. నంద్యాల తెదేపా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, తెదేపా నాయకుడు ఎన్.ఎం.డి.ఫిరోజ్ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు.
మూనాలు పరిశీలనకు – రంగారెడ్డి, డీఈవో
మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పొంగలి, గుడ్డు, సాంబారు వడ్డించారు. విద్యార్థుల అస్వస్థతకు కారణం కోడి గుడ్లని ప్రాథమికంగా తేలింది. నమూనాలు తీసుకొని ల్యాణ్కు పంపించాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.
విద్యాశాఖామంత్రి ఆరా!
విద్యార్థులకు అస్వస్థతపై మంత్రి సురేశ్‌ ఆరా తీశారు. ఈ మేరకు కర్నూలు  డీఈవోతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  కొందరు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తరువాత వాంతులు చేసుకున్నారు. కారణాలు తెలుసుకోవాలని, ఆహారపదార్థాలు పరీక్షించాలని మంత్రి ఆదేశించారు. పిల్లలందరికీ పరీక్షలు చేసి అస్వస్థతకు గురైన వారికి వైద్యం అందించాలని సూచించారు. అందరూ సురక్షితంగా ఇళ్లకు వెళ్లేవరకూ విద్యాశాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని మంత్రి సురేష్ ఆదేశించారు.
అనంతపురం జిల్లాలోనూ..
అనంతపురం జిల్లా కక్కలపల్లిలో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. పాఠశాలలో తిన్న ఆహారం వల్లే అస్వస్థత గురైనట్లు విద్యార్థులు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నేతలు ఆస్పత్రిలోని పిల్లల వార్డు వద్ద ఆందోళన చేపట్టారు. పాఠశాల తనిఖీపై డీఈవోను ప్రశ్నించారు.
ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్
విద్యార్థులకు వడ్డించిన అన్నంలో పురుగులు ఉన్నట్లు గుర్తించి పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు.  కక్కలపల్లిలో విద్యార్థుల అస్వస్థతపై డీఈవో అగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన డీఈవో శామ్యూల్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీ నరసింహను సస్పెండ్‌ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను సైతం తొలగించారు.
విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో ఎంపీ తలారి రంగయ్య, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, జేసీ సిరి తదితరులు సర్వజన ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థులను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని పర్యవేక్షకురాలు మల్లీశ్వరి, ఆర్ఎంవో విశ్వనాథయ్యకు సూచించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles