30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

సౌదీలో ఒకేరోజు 81 మందికి ఉరిశిక్ష!

రియాద్: సౌదీ అరేబియా చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఒకేరోజు భారీ సంఖ్యలో సామూహిక మరణ శిక్షను అమలు చేసింది. శనివారం నాడు ఒకేరోజు 81 మందిని ఉరితీసింది. తీవ్రవాదంతో పాటు ఇతర నేరాల కింద శిక్ష పడిన 81 మందిని ఇలా ఒకేరోజు మరణ శిక్షను విధించింది. కింగ్‌డమ్ ఆధునిక చరిత్రలో నిర్వహించబడిన అతిపెద్ద సామూహిక ఉరిశిక్ష ఇదేనని సౌదీ ప్రెస్ ఏజెన్సీ(ఎస్‌పీఏ) పేర్కొంది. 1979లో మక్కాలోని గ్రాండ్ మసీదును స్వాధీనం చేసుకున్నందుకు దోషులుగా తేలిన 63 మంది మిలిటెంట్లకు 1980 జనవరిలో సామూహిక మరణశిక్ష విధించింది. ఇప్పుడు ఇది ఆ సంఖ్యను కూడా మించిపోయింది. ఉరి తీయబడిన 81 మందిలో ఏడుగురు యెమెన్ జాతీయులు, ఒకరు సిరియన్ కాగా మిగతా 73 మంది సౌదీ పౌరులు అని ఎస్‌పీఏ వెల్లడించింది. గల్ఫ్‌ రాజ్య ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద సామూహిక మరణశిక్షల అమలు చర్యగా చెప్పవచ్చు.
ప్రపంచం మొత్తం దృష్టి ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కేంద్రీకృతమై ఉన్న సమయంలో ఈ పరిణామం జరిగింది. కింగ్ సల్మాన్ అతని కుమారుడు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ హయాంలో వివిధ కేసులలో దోషుల శిరచ్ఛేదం కొనసాగినప్పటికీ, సౌదీ అరేబియాలో మరణశిక్ష కేసుల సంఖ్య కరోనావైరస్ మహమ్మారి సమయంలో తగ్గింది. శనివారం విధించిన మరణశిక్షల వివరాలను తెలియజేస్తూ, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. అయితే మరణశిక్ష ఎక్కడ విధించారనేది మాత్రం వెల్లడించలేదు.
అయితే, ఉరిశిక్షల కోసం సౌదీ శనివారాన్ని ఎందుకు ఎంచుకుంటుందో స్పష్టంగా తెలియలేదు. ఇక 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 67 మందికి మరణ శిక్ష అమలు చేయగా, 2020లో 27 మందిని ఉరి తీసింది. కింగ్‌డమ్‌లో చివరి సామూహిక ఉరి 2016 జనవరిలో జరిగింది. అప్పుడు ఒకేసారి 47 మంది వ్యక్తులను ఉరితీసింది. ఇదిలాఉంటే.. కరోనావైరస్ మహమ్మారి సమయంలో సౌదీ అరేబియాలో మరణశిక్ష కేసుల సంఖ్య తగ్గింది.  పురుషులు, మహిళలు, పిల్లలను హత్య చేయడంతో సహా వివిధ నేరాలకు పాల్పడినవారినే దోషులుగా నిర్థారించి ఉరి తీసినట్టు ఎస్‌పీఏ సౌదీ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే ఉరితీయబడిన వారిలో కొందరు అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సభ్యులు, యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల మద్దతుదారులు కూడా ఉన్నట్లు సౌదీ తెలిపింది. కాగా, నిన్నటి ఉరిశిక్షలు వెంటనే అంతర్జాతీయ విమర్శలకు దారితీశాయి. మహ్మద్ బిన్ సల్మాన్ సంస్కరణకు హామీ ఇచ్చినప్పుడు రక్తపాతం తప్పదని ప్రపంచం ఇప్పటికైనా తెలుసుకోవాలని లండన్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ రిప్రైవ్ డిప్యూటీ డైరెక్టర్ సొరయా బోవెన్స్ అన్నారు. మరణశిక్ష విధించడం ద్వారా మానసికంగా, శరీరంగా హింసించారని, రహస్యంగా విచారించారని యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ అలీ అదుబాసి ఆరోపించారు.
దోషులను సౌదీ అరేబియా సామూహికంగా ఉరితీయడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది, ఈ చర్య “మానవ హక్కులు అంతర్జాతీయ చట్టాల ప్రాథమిక సూత్రాలను” ఉల్లంఘిస్తోందని పేర్కొంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles