24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

వైద్యులపై హింస ఆందోళనకరం… సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ!

న్యూఢిల్లీ: వైద్యులపై హింస, తప్పుడు కేసులు పెరిగిపోతూ ఉండడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు అలుపు లేకుండా నిరంతరం శ్రమిస్తున్నారని సీజేఐ కొనియాడారు. “కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో వందలమంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే డాక్టర్లకు వ్యతిరేకంగా హింస పెరిగిపోవడం నాకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. నిజాయతీగా, కష్టపడి పనిచేసే వైద్యులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. వారికి సురక్షితమైన పని వాతావరణం అవసరం” అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

తన కూతురూ డాక్టరే కావడంతో వైద్యుల సమస్యలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ‘‘రోగుల క్షేమం కోసం నిరంతరాయంగా చెమటోడ్చే వైద్యుల స్ఫూర్తిని అభినందిస్తున్నా. వైద్యులంటే మన మిత్రులు, కౌన్సెలర్లు, దిశానిర్దేశకులు. సమాజంలో, ప్రజల సమస్యల పరిష్కారంలో వారిది చురుకైన పాత్ర కావాలి. వారు పని చేసేందుకు మరింత మెరుగైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరముంది’’ అని ఆయన అన్నారు.

నిన్న ఢిల్లీలో డాక్టర్‌ కల్నల్‌ సీఎస్‌పంత్‌; డాక్టర్‌ వనితా కపూర్‌ రాసిన పుస్తక విడుదల కార్యక్రమంలో జస్టిస్‌ రమణ మాట్లాడారు.. దేశ జనాభాలో 70 శాతానికి నేటికీ మౌలిక వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చాలా ఊళ్లలో డాక్టర్లుండరు. వాళ్లుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రముండదు. రెండూ ఉంటే సరైన సదుపాయాలుండవు. ఇదీ మన దేశంలో ఆరోగ్య సేవల పరిస్థితి!’’ అన్నారు. సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రానికి ఆయన సూచించారు.

రచయితలను అభినందిస్తూ, సీజేఐ రమణ మహిళల ఆరోగ్యం గురించి కూడా ప్రస్తావించారు. జనాభాలో మహిళలు 50 శాతం ఉన్నారని ఎత్తి చూపుతూ, “వారి ఆరోగ్యం పట్ల  మనం శ్రద్ధ చూపాలని  ఆయన అన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య బాధ్యతలను మహిళలే చూసుకుంటారు కాబట్టి వారి ఆరోగ్యం గురించి మిగతా కుటుంబసభ్యులే జాగ్రత్త వహించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. వారికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించి, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలన్నారు.

ఇక వైద్యరంగంలో పరిశోధనలకు ఊతమివ్వాలని సీజేఐ సూచించారు. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలతో పాటు కార్పొరేట్లను కూడా భాగస్వాములను చేయాలని అభిప్రాయపడ్డారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద గ్రామీణ ప్రాంతాల్లో అవి వైద్య సదుపాయాలు అందించేలా చూడాలని కోరారు. వైద్య వ్యవస్థ మెరుగుకు ఓ రోడ్‌ మ్యాప్‌ తప్పనిసరి’’ జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్‌ బారిన పడుతోందంటూ పలు గణాంకాలు వివరించారు. కుటుంబ, సమాజ, దేశ సంక్షేమంలో కీలక పాత్ర పోషించే మహిళలు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles