28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

నిఖత్‌ జరీన్‌… వరల్డ్ ఛాంపియన్​!

ఇస్తాంబుల్/టర్కీ:  ప్రపంచ వేదికల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మొన్నటికి మొన్న భారత షటర్లు సత్తా చాటి థామస్‌కప్‌ బ్యాడ్మింటన్‌ సాధించి చరిత్ర సృష్టించగా.. ఇపుడు భారత బాక్సర్‌… తెలుగు తేజం… తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌ జరీన్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో తెలుగు రాష్ట్రాల నుంచి స్వర్ణ పతకం గెలిచిన తొలి బాక్సర్‌గా తన పేర రికార్డు లిఖించుకుంది. మొత్తం మీద ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో పసిడి గెలిచిన అయిదో భారత బాక్సర్‌గా నిలిచింది మన నిఖత్‌.

టర్కీలోని ఇస్తాంబుల్ లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ పోటీల్లో 52 కిలోల విభాగంలో.. థాయ్‌లాండ్‌ దేశానికి చెందిన జిట్ పాంగ్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. మూడు రౌండ్ల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల నిఖత్‌ ప్రత్యర్థిపై ఆరంభం నుంచే పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది. దీంతో 30-27, 29-28, 29-28, 30-27, 29-28 స్కోరింగ్‌తో జడ్జీలు ఏకగ్రీవంగా విజేతను ప్రకటించారు. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా టోర్నీలో వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన ఐదో భారత బాక్సర్‌గా నిఖత్‌ నిలిచింది.

మొదటి నుంచి నిఖత్ జరీన్ దూకుడుగా ఆడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్ లతో విరుచుకు పడింది. అంచనాలను అందుకుంటూ.. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సర్వశక్తులూ ఒడ్డి స్వర్ణం తెచ్చేసింది ఈ ఇందూరు అమ్మాయి. స్వర్ణమే అంతిమ లక్ష్యంగా మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో బరిలోకి దిగింది. టోర్నీ ఆరంభమైంది మొదలు ప్రత్యర్థులపై దూకుడే తారక మంత్రంగా విరుచుకుపడింది. తద్వారా తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది.

గతంలో మేరీ కోమ్‌, సరితాదేవి, ఆర్‌ఎల్‌ జెన్నీ, కేసీ లేఖ ఈ ఫీట్‌ సాధించారు. అయితే చివరిసారిగా 2018లో మేరీకోమ్‌ (48కేజీ) భారత్‌కు వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప సాధించగా.. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ బాక్సర్‌ దేశానికి స్వర్ణం అందించడం విశేషం. 73 దేశాల నుంచి దాదాపు 310 మంది మహిళా బాక్సర్లు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్ తరుపున నిఖత్ జరీన్ సత్తా చాటడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ప్రధాని మోదీ అభినందన!
“మన బాక్సర్లు మనల్ని గర్వపడేలా చేశారు. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో పసిడి గెలిచిన నిఖత్‌ జరీన్‌కు అభినందనలు. అదే టోర్నీలో కాంస్యాలు నెగ్గిన మనీషా, పర్వీన్‌లను అభినందిస్తున్నా”.

గవర్నర్ తమిళిసై అభినందనలు!
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన యువబాక్సర్ నిఖత్ జరీన్కు తెలంగాణ గవర్నర్ తమి సౌందరరాజన్ అభినందనలు తెలిపారు. నిఖత్ జరీన్ను చూసి తెలంగాణ గర్విస్తోందన్నారు.

జరీన్ విశ్వవిజేతగా నిలవడం రాష్ట్రానికి గర్వకారణం: సీఎం కేసీఆర్
యువ బాక్సర్ నిఖత్ జరీన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. జరీన్ విశ్వవిజేతగా నిలవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. యువక్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం పేర్కొన్నారు.

లక్ష్యం సాధించింది
మాకు నలుగురూ కూతుళ్లే అయినా.. అబ్బాయిలకు తగ్గట్టుగానే వారిని పెంచాం. ఒకప్పుడు నిఖత్‌కు బాక్సింగ్‌ అవసరమా అని అన్నవాళ్లే ఇవాళ మా వద్దకు వచ్చి మీ అమ్మాయిని చూస్తే గర్వంగా ఉంది అని అంటున్నారు. ఇది మాకు చాలా ఆనందాన్నిస్తోంది. ప్రపంచ చాంపియన్‌ కావాలన్న తన కలను నిఖత్‌ నెరవేర్చుకుంది. ఇక.. వచ్చే ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం సాధిస్తుందన్న విశ్వాసముంది.
– నిఖత్‌ తల్లిదండ్రులు పర్వీన్‌ సుల్తానా, జమీల్‌ అహ్మద్‌

నిఖత్‌ కెరీర్‌లో గెలిచిన పతకాలు

  • 2011   జూనియర్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
  • 2014   యూత్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజతం
  • 2014  నేషన్స్‌ కప్‌ ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ టోర్నీలో స్వర్ణం
  • 2015  సీనియర్‌ మహిళల జాతీయ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
  • 2019  థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో రజతం
  • 2019  ఆసియా అమెచ్యూర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం
  • 2019, 2022  స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీలో స్వర్ణాలు
  • 2022  మహిళల వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles