24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణలో హ్యందాయ్…. 1400 కోట్ల భారీ పెట్టుబడి!

స్విట్జర్లాండ్: దావోస్‌లో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆయన టీమ్ దూసుకుపోతోంది. తాజాగా  దావోస్ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో 1400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు హ్యుండాయ్ కంపెనీ ప్రకటించింది. దావోస్​లోని తెలంగాణ పెవిలియన్​లో మంత్రి కేటీఆర్​తో సమావేశమైన హ్యుండాయ్ సీఐఓ యంగ్చోచి ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్​లో పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీలో కూడా భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. ఈ పెట్టుబడితో కంపెనీ టెస్ట్ ట్రాక్​లతో పాటు ఇకో సిస్టమ్ అవసరమైన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు హ్యుండాయ్ సంస్థ తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న ఇతర అవకాశాలపై కూడా యంగ్చోచి మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో మొబిలిటీ రంగానికి హ్యుండాయ్ సంస్థ పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా ఒక మొబిలిటీ వ్యాలీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్న ఆయన… అందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకొచ్చిన హ్యుండాయ్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. 1400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీకి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి చెప్పారు. హ్యుండాయ్ రాకతో తెలంగాణ రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు మొబిలిటీ రంగంలో వస్తాయన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.

మొత్తంగా దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పెట్టుబడులను ఆకర్షించడంలో కేటీఆర్ బృందం ముందు వరుసలో నిలుస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, మీడియా ప్రతినిధులతో ఇంటర్వ్యూలతో దావోస్‌లో కేటీఆర్ బిజిబిజీగా ఉన్నారు. తనదైన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

హ్యుందాయ్‌ మోటార్‌ నేపథ్యం….

ప్రధాన కార్యాలయం:                              సియోల్‌, దక్షిణ కొరియా
స్థాపించిన సంవత్సరం:                            1967
ఉత్పత్తులు:                                       లగ్జరీ కార్లు,వాణిజ్య వాహనాలు, ఇంజిన్లు
గ్లోబల్‌ ఆదాయం:                                  9,300 కోట్ల డాలర్లు (2021)
నికరలాభం:                                        450 కోట్ల డాలర్లు
ఉద్యోగుల సంఖ్య:                                  1,05,000
భారత్‌లో టర్నోవర్‌:                                550 కోట్ల డాలర్లు
దేశంలో వార్షిక తయారీ కెపాసిటీ:                  7.40 లక్షల యూనిట్లు

కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్‌ మోటర్‌ మన దేశంలో సుపరిచితమైన బ్రాండ్‌. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హ్యుందాయ్‌ 193 దేశాల్లో కార్లను విక్రయిస్తున్నది. అదే దేశంలోని ఉల్సన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ ప్లాంట్‌ ఉంది. ఈ ప్లాంట్‌లో ఏడాదికి 16 లక్షల వాహనాలు ఉత్పత్తవుతాయి.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles