28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

వ్యాపార సంస్కరణల్లో తెలంగాణ టాప్‌… ర్యాంకులు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం!

  • వ్యాపార సంస్కరణలో 7 రాష్ట్రాలు టాప్‌
  • తొలి వరసలో తెలంగాణ, ఏపీ
  • ఈసారి 4 గ్రూపులుగా విభజన
  • పెట్టుబడులకు అనువైన ప్రాంతం
  • టీఎస్‌ఐపాస్‌తో తరలివస్తున్న కంపెనీలు
  • రాష్ట్రానికి గర్వకారణం… కేటీఆర్‌

న్యూఢిల్లీ: వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (BRAP) 2020 సంబంధించిన ర్యాంకుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమలకు శాఖకు అనుబంధంగా ఉండే పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐఐటీ) ఏటా ప్రకటించే సులభతర వాణిజ్యం ర్యాంకులను గురువారం వెల్లడించింది. ఇదివరకు ప్రపంచ బ్యాంక్‌ సహకారంతో సులభతర వాణిజ్యం పేరుతో ర్యాంకులు ప్రకటిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక పేరుతో రాష్ట్రాల పనితీరును మదింపు చేసి ‘బిజినెస్‌ రీఫామ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2020’ పేరుతో నివేదిక రూపొందించింది. దాని ప్రతిని ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సంయుక్తంగా  విడుదల చేశారు.

గతంలో ఉన్న ర్యాంకుల విధానానికి స్వస్తి పలుకుతూ ఈ ఏడాది రాష్ట్రాలను  టాప్‌ అచీవర్స్, అచీవర్స్, యాస్పైర్స్, ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఎకో సిస్టమ్స్‌ పేరుతో నాలుగు విభాగాలుగా రాష్ట్రాలను విభజించారు. సర్వేలో 92 శాతం మార్కులు దాటిన ఏడు రాష్ట్రాలను టాప్‌ అచీవర్స్‌గా ప్రకటించారు.

టాప్ అచీవర్స్ కేటగిరీలో ఉన్న మిగతా ఆరు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు. “అచీవర్స్” విభాగంలో మరో ఆరు రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్  ఉన్నాయి.

అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ “ఆస్పైరర్స్” విభాగంలో, అండమాన్ & నికోబార్, బీహార్, చండీగఢ్, డామన్ & డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ, ఢిల్లీ, జమ్మూ & కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, పుదుచ్చేరి, త్రిపుర “ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్స్” కేటగిరీ క్రింద చేర్చారు.

రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు
2020 సంవత్సరానికి గాను 301 సంస్కరణలను కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. దీనిలో తెలంగాణ 94.86 శాతం స్కోర్‌ సాధించింది. మొత్తం 301 సంస్కరణలకు గాను 281 సంస్కరణలను పూర్తిచేయగా మరో 20 సంస్కరణలు రాష్ర్టానికి సంబంధం లేనివే. మిగతా అన్ని విభాగాల్లో సంస్కరణలను పూర్తి చేసింది. కన్‌స్ట్రక్షన్‌ పర్మిట్‌ ఎనేబులర్స్‌, యుటిలిటీ అనుమతులు, భూ సంస్కరణలు, భూ బదిలీ, ఆస్తి బదిలీ, భూ వినియోగంలో మార్పులు, ఇన్‌స్పెక్షన్‌ ఎనేబులర్స్‌, తూనికలు కొలతలు, అతిథ్య రంగం, పర్యాటక రంగం అంశాల్లో సంస్కరణలను 2020లో అమలు చేసింది.  ఫలితంగా ఈవోడీబీలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.

వ్యాపార సంస్కరణలకు పెద్ద పీట
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ మాట్లాడుతూ దేశంలో 1991 నుంచి సంస్కరణల స్వభావం మారింది. 1991 నాటి సంస్కరణల మాదిరిగా ఇప్పుడు ఒత్తిడి పరిస్థితులు లేవు. మరింత పారదర్శకమైన వ్యవస్థను రూపొందించడమే లక్ష్యం. కొన్నేళ్లుగా వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక కింద అమలు చేస్తున్న సంస్కరణలు మంచి ఫలితాలను అందిస్తున్నాయని ఆమె తెలిపారు.

దేశ ర్యాంకింగ్‌ మెరుగు పర్చుకోవడమే లక్ష్యం
ఈ కార్యక్రమంలో వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ… సులభతర వాణిజ్యంలో దేశం ర్యాంక్‌ మెరుగు పరచాలన్న ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా 2014లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ సంస్కరణలకు నాంది పలికాం. దీనివల్ల ఇప్పుడు సులభతర వాణిజ్యం అనేది కొన్ని ప్రాంతాలు, నగరాలకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా ప్రతిబింబిస్తోందని అన్నారు.

మొత్తంగా వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (BRAP) సూచించిన సంస్కరణల అమలులో వారి పనితీరు ఆధారంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను 2014 నుండి డీపీఐఐటీ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు, 2015, 2016, 2017-18  2019 సంవత్సరాలకు సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మదింపు విడుదల చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles