28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ముంద్రా పోర్ట్ సమీపంలో 376 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం!

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో డ్రగ్స్‌ కలకం రేపింది. పోర్ట్‌ సమీపంలో యాంటీ టెర్రరిస్ట్‌ స్వాడ్‌ (ATS) జరిపిన సోదాల్లో ఈ బండారం బయటపడింది. ఓ కంటైనర్‌లో రూ.376.50 కోట్ల విలువైన 75.3 కిలోల హెరాయిన్‌ పట్టుపడింది. అధికారులను తప్పుదోవ పట్టించేందుకు దుండగులు ఫాబ్రిక్‌ రోల్స్‌లో డ్రగ్స్‌ను సరఫరా చేసే ప్రయత్నం చేశారు. ఫాబ్రిక్‌ రోల్స్‌లో చిన్నపాటి ఖాళీలను సృష్టించి అందులోకి హెరాయిన్‌ను నింపారని గుజరాత్ డీజీపీ ఆశిష్​ భాటియా వెల్లడించారు.

అంతేకాదు.. X-RAYలో సైతం బయటపడకుండా కార్బన్ టేపులతో ఫాబ్రిక్ రోల్స్‌ను దుండగులు మూసివేశారని పోలీసులు పేర్కొన్నారు. రెండు నెలల కింద ముంద్రా ఓడరేవుకు వచ్చిన ఓ కంటైనర్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న పంజాబ్‌ పోలీసులు గుజరాత్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గుజరాత్, పంజాబ్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దొరికిన డ్రగ్స్ యూఏఈ నుంచి వచ్చాయి. పంజాబ్‌కు రవాణా చేయడానికి సిద్ధంగా ఉండగా పట్టుబడ్డాయి. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు.

ఈ కంటైనర్‌ను UAEలోని ఒక గ్రీన్ ఫారెస్ట్ జనరల్ ట్రేడింగ్ పంపిందని, దానిని కచ్‌లోని గాంధీధామ్‌లో ఉన్న ఆఫీసు అడ్రస్‌కు పంపించారని, పశ్చిమ బెంగాల్‌కు చెందిన డెలివరీ ఏజెంట్ జోవియల్ కంటైనర్ లైన్స్ దీన్ని స్వీకరించిందని ఆయన చెప్పారు.  ముంద్రా పోర్ట్ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగిన ప్రశ్నకు  ఒక పోర్టును మాత్రమే అనుమానించడం తప్పు అని భాటియా అన్నారు.

డ్రగ్స్‌ వ్యాపారులు భారత్‌కు డ్రగ్స్‌ను పంపేందుకు అనువైన మార్గాన్ని ఉపయోగిస్తుంటారు. ముంద్రా మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో గుజరాత్‌లోని కాండ్లా, పిపావావ్ వంటి ఇతర ఓడరేవుల నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాం. మహారాష్ట్రలోని న్హవా షెవా ఓడరేవు నుంచి కూడా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై, పశ్చిమ బెంగాల్‌లో కూడా,” అని గుజరాత్ డీజీపీ చెప్పారు.

రాష్ట్ర పోలీసులు, ఇతర నిఘా సంస్థల అప్రమత్తత కారణంగా గుజరాత్ ఓడరేవులకు పంపిన డ్రగ్స్ చాలా వరకు స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. ఏటీఎస్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) సహా వివిధ రాష్ట్ర, కేంద్ర సంస్థలు ఇటీవల కాలంలో ఇతర దేశాల నుంచి గుజరాత్‌ ఓడరేవులకు షిప్పింగ్‌ కంటైనర్‌ల నుంచి కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి.

గత ఏడాది సెప్టెంబర్‌లో ముంద్రా పోర్ట్‌లోని రెండు కంటైనర్‌ల నుండి డిఆర్‌ఐ దాదాపు 3,000 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది, ఇది ఆఫ్ఘనిస్తాన్‌ నుండి వచ్చింది. ప్రపంచ మార్కెట్‌లో దీని విలువ సుమారు ₹ 21,000 కోట్లు ఉంటుంది.  ఈ సంవత్సరం మేలో, ముంద్రా పోర్ట్ సమీపంలోని కంటైనర్ నుండి సుమారు ₹ 500 కోట్ల విలువైన 56 కిలోల కొకైన్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) స్వాధీనం చేసుకుంది.

ఏప్రిల్‌లో కచ్‌లోని కాండ్లా ఓడరేవు సమీపంలో ఒక కంటైనర్ నుండి ₹ 1,439 కోట్ల విలువైన 205.6 కిలోల హెరాయిన్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles