28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

బీహార్‌లో నిన్న అనూహ్య రాజకీయ పరిణామాలు… సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం నేడే!

పాట్నా: బీహార్‌లో నిన్న అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించాయి.  ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీకి బిగ్ షాకిచ్చారు.  ఎన్డీఏ కూటమిని వీడారు.  మంగళవారం జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాట్నాలో నిర్వహించిన సమావేశంలో బీజేపీతో తెగదెంపులపై నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో కలిసి బీహార్ గవర్నర్ చౌహాన్‌ను కలిశారు. రాజీనామా లేఖ సమర్పించారు. ఫలితంగా రెండేళ్ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది.

మంగళవారం బిజెపిని వీడి తేజస్వి యాదవ్ ఆర్జేడీ – కాంగ్రెస్ – లెఫ్ట్ పార్టీల సారథ్యంలో మహాఘట్‌బంధన్‌ ఏర్పాటు చేశారు. వెంటనే గవర్నర్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ ఉందని తెలుపుతూ లేఖలు సమర్పించారు. తమకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నితీశ్ వెల్లడించారు. దీంతో బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు రంగం సిద్ధమైంది.  నితీష్ కుమార్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు మంత్రులుగా ఎవరూ ప్రమాణ స్వీకారం చేయబోరని అంటున్నారు.

ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి అయినప్పటికీ, ప్రభుత్వ తప్పులన్నింటికీ ముఖ్యమంత్రే కారణమనేలా ఆ పార్టీ విమర్శలు గుప్పించటం నితీశ్‌కుమార్‌లో మరింత అభద్రతాభావాన్ని పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు కూడా వెన్నుపోటు తప్పదని ఊహించిన ఆయన, ఎన్డీయే నుంచి దూరం జరుగుతూ వచ్చారు. బీజేపీ వ్యతిరేకిస్తున్నప్పటికీ దేశంలో ఓబీసీ కుల గణన చేపట్టాలని తీర్మానం చేశారు. జేడీయూను బలహీనపరుస్తూ బీహార్‌లో బీజేపీ బలపడుతున్నదని బహిరంగంగానే ఆరోపించారు.

దేశంలో ప్రాంతీయ పార్టీలు త్వరలోనే ధ్వంసమైపోతాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా బీహార్‌కే వెళ్లి ప్రకటించటంతో పరిస్థితులు మరింత క్షీణించాయి. బీజేపీతో తనకు ఎప్పటికైనా ప్రమాదమేనని భావించిన ఆయన, మంగళవారం తన పార్టీ నేతలందరితో సమావేశమై ఎన్డీయే నుంచి బయటకు రావాలని నిర్ణయించారు. జేడీయూతోపాటు హెచ్‌ఏఎల్‌ కూడా బీజేపీని వీడి మహా ఘట్‌బంధన్‌లో చేరిపోయింది.

నితీశ్ కుమార్ ఎన్డీఏని వీడటం ఇది రెండోసారి :

బీహార్‌లో 2005 నుంచి 2013 వరకు బీజేపీ, జేడీయూ పొత్తు కొనసాగింది. బీజేపీ మద్దతుతో నితీశ్ రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2013లో ఎన్డీయేని వీడిన నితీశ్ కుమార్ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. కానీ మహాకూటమిలో రెండేళ్లకే చీలిక వచ్చింది. తిరిగి 2017లో నితీశ్ మళ్లీ ఎన్డీయేతో జతకట్టారు. 2020లో బీజేపీతో కలిసే ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో గెలిచాక నితీశ్ కుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

సంకీర్ణ ప్రభుత్వం మధ్యలో భాగస్వాములను మార్చడం ద్వారా నితీశ్‌ కుమార్‌ ప్రజల ఆదేశానికి ద్రోహం చేశారని బీజేపీ ఆరోపించింది. నితీష్‌కుమార్‌ చర్యకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రకటించింది.

బీజేపీతో తెగదెంపులకు కారణమిదే :

గత కొన్నాళ్లుగా బీజేపీ తీరు పట్ల నితీశ్‌లో అసంతృప్తి రాజుకుంది. కేంద్ర కేబినెట్‌లో జేడీయూకి రెండు బెర్తులు ఇవ్వాలని నితీశ్ కేంద్రాన్ని కోరగా కేవలం ఒకరికే అవకాశం కల్పించారు. అది కూడా నితీశ్‌ను సంప్రదించకుండానే జేడీయూ నేత ఆర్‌సీపీ సింగ్‌ను కేంద్రమంత్రిని చేశారు. తమ పార్టీలో ఎవరిని కేంద్రమంత్రిని చేయాలనేది కూడా అమిత్ షానే నిర్ణయించడం నితీశ్‌ అవమానంగా భావించారు. ఈ క్రమంలో ఆర్‌సీపీ సింగ్‌కి నితీశ్ మరోసారి రాజ్యసభ అవకాశం కల్పించలేదు. పైగా ఆర్‌సీపీ సింగ్ బీజేపీ నేతలతోనే ఎక్కువ సఖ్యతగా మెలగడం ఆయనకు నచ్చలేదు. ఈ పరిణామాలన్నీ నితీశ్‌కు మహారాష్ట్ర రాజకీయాన్ని తలపించాయి. జేడీయూని చీల్చేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక బీజేపీతో మిత్ర బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles