24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ దుర్మరణం!

ముంబై: టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబాయి వస్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు పాల్‌ఘడ్‌ జిల్లాలో సూర్యనది వంతెనపై డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే సైరస్ మృతి చెందారు. ఆయనతోపాటు వెంట ఉన్న జహంగీర్‌ పండోల్‌ అనే మరో వ్యక్తి అక్కడికక్కడే మరణించినట్టు పాల్ఘర్‌ జిల్లా ఎస్పీ బాలాసాహెబ్‌ పాటిల్‌ వెల్లడించారు. కారు డ్రైవర్‌తో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం గుజరాత్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్​ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు వివరించారు.  2006లో టాటా గ్రూప్‌లో సభ్యుడిగా సైరస్ మిస్త్రీ చేరారు.  2012-2016 వరకు టాటా సన్స్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన మృతి పట్ల వ్యాపార, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

మిస్త్రీ అకాల మరణం షాకింగ్​కు గురిచేసిందని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం ప్రపంచ వ్యాపార పరిశ్రమకు తీరని లోటు అని ట్వీట్​ చేశారు.

మిస్త్రీ మరణవార్త విని కలత చెందినట్లు ట్వీట్​ చేసిన కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. మిస్త్రీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ శిందే సహా పలువురు ప్రముఖులు మిస్త్రీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మిస్త్రీ మరణం తీవ్రంగా బాధిస్తుందని ట్వీట్​ చేశారు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడణవీస్​. డీజీపీతో మాట్లాడి.. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

1968 జులై 4న సైరస్ మిస్త్రీ జన్మించారు. యూకేలోని ఇంపీరియల్ కాలేజ్‌లో సివిల్ ఇంజనీరింగ్, లండన్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్‌సీ చేశారు. 2006 నుంచి టాటా సన్స్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. 2011లో టాటా సన్స్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా టెలి సర్వీసెస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీలకు డైరెక్టర్‌గా పనిచేశారు.

2012లో రతన్ టాటా పదవి విరమణ చేసిన తర్వాత టాటా గ్రూప్‌నకు సైరస్ మిస్త్రీ ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. అప్పటివరకు షాపూర్జీ పల్లోంజి గ్రూప్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన ఉన్నారు. టాటా సన్స్ హోల్డింగ్స్‌లో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు 18 శాతం వాటా ఉంది. ఐతే ఛైర్మన్‌గా నాలుగేళ్లు పనిచేసిన తర్వాత మిస్త్రీని టాటా గ్రూప్‌ తొలగించింది. వివిధ లక్ష్యాలను అందుకోవడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వచ్చాయి.

ఆత్మీయ మిత్రుడిని కోల్పోయా : మంత్రి కేటీఆర్‌
టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మరణంపై రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘షాక్‌కు గురయ్యా. ఆత్మీయ స్నేహితుడిని కోల్పోయా. సైరస్‌ మిస్త్రీ ఎంతో వినయం, గౌరవ మర్యాదలతో కూడిన మంచి మనషుల్లో ఒకరు. ఎనిమిదేళ్లకు పైగా నాకు మంచి స్నేహితుడు. సైరస్‌ మిస్త్రీ ఇక లేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్‌ చేశారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles