26.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

టీఆర్ఎస్ ఇక భార‌త్ రాష్ట్ర స‌మితి… కేసీఆర్‌ కొత్త జాతీయ పార్టీ!

హైదరాబాద్: విజయదశమి నాడు టీఆర్ఎస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది.  ఇకనుంచి  తెరాస  జాతీయపార్టీగా రూపాంతరం చెందింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే ధ్యేయంగా 21 ఏళ్ల క్రితం ఏర్పాటైన తెరాస… జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైంది.  కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ పార్టీని కేసీఆర్​ ఏర్పాటు చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చుతూ తెలంగాణ భవన్‌లో జరిగిన తెరాస సర్వ సభ్య సమావేశంలో తీర్మానించారు. తెరాస సర్వ సభ్య సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు హాజరయ్యారు.  అంతేకాదు ఈ భేటీలో తమిళనాడులోని వీసీకే పార్టీ నేతలు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సైతం హాజరయ్యారు.

దేశ ప్ర‌జ‌ల అభ్యున్న‌తిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నూత‌న జాతీయ పార్టీని ప్ర‌క‌టించగానే.. తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద గులాబీ శ్రేణుల సంబురాలు ఆకాశాన్నంటాయి. పార్టీ కార్యక‌ర్తలు భారీ స్థాయిలో త‌ర‌లివ‌చ్చి సంబురాలు చేసుకుంటున్నారు. దేశ్ కా నేత‌.. టుడే సీఎం.. టుమారో పీఎం.. జై కేసీఆర్ స‌ర్.. జై డీఎన్ఆర్ అని ప్రద‌ర్శించిన ప్లకార్డు వైర‌ల్ అవుతోంది. ఇక తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. గిరిజ‌నుల నృత్యాలు ఆక‌ట్టుకుంటున్నాయి.

తీర్మానం కాపీని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి  ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌ పార్టీ పేరు మార్పునకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించనున్నది. ఎన్నికల కమిషన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ పేరుకు సంబంధించి నిర్ధిష్ట గడువుతో అభ్యంతరాలు కోరే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఎన్నికల సంఘం అధికారికంగా భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ పేరుపై అధికారికంగా ప్రకటించనున్నది.

టీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా వచ్చే నెలలో జరిగే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తరఫునే అభ్యర్థి బరిలో ఉంటారని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ పేరు మార్పు ప్రక్రియ నామినేషన్ల నాటికి పూర్తికాదని, కనీసం నెల రోజులు పట్టవచ్చని.. అందుకే టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే పోటీకి దించుతామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా.. కేసీఆర్‌ ఏర్పాటు చేసే జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుపెట్టనుంది. ఆయన ఇప్పటికే ఏపీలోని టీడీపీ నేతలను సంప్రదించారని సమాచారం. ఆ రాష్ట్ర టీడీపీ, బీజేపీ నేతలు కొందరు తమతో టచ్‌లో ఉన్నారని తెలంగాణ మంత్రి ఒకరు తెలిపారు.

శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, కడప తదితర జిల్లాలకు చెందిన కొందరు నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. వీరిలో కొందరితో కేసీఆరే నేరుగా మాట్లాడారని అంటున్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు..  టీడీపీలో ఉన్న పలువురు కేసీఆర్‌కే కాకుండా…టీఆర్‌ఎ్‌సలోని పలువురికి సన్నిహితంగా ఉన్నవారే. వీరిలో కొందరు బీఆర్‌ఎస్‌ ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేశారని, పార్టీలో చేరి క్రియాశీలంగా ఉండేందుకు ఆసక్తి కనబరిచారని పేర్కొంటున్నారు. ఆంధ్రలోనూ తమ పార్టీ శాఖ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

టీఆర్ఎస్ ఏర్పాటు… నేపథ్యం!

2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెరాసను స్థాపించి గులాబీ జెండాను ఎగురవేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకొని కొన్నాళ్లకు బయటకు వచ్చారు. ఆ తర్వాత తెరాస రాజకీయం మలుపులు తిరుగుతూ వచ్చింది. 2009 ఎన్నికల్లో బాగా నష్టపోయిన గులాబీ పార్టీ… 2010 నుంచి క్రమంగా బలపడుతూ వచ్చింది. 2009 నవంబర్ 29న కేసీఆర్​ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెరాస ఘన విజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.

సంక్షేమ పథకాలు:-

 తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్​ నేతృత్వంలోని తెరాస సర్కార్… పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టింది.  మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, రెండు పడకల గదుల ఇళ్లు, కులవృత్తులకు తోడ్పాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం పథకాలను చేపట్టింది. కోటి ఎకరాల మాగాణి లక్ష్యాన్ని నిర్ధేశించుకొని సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్మిస్తోంది. కాళేశ్వరం పేరిట ప్రపంచంలోనే అతి పెద్దదైన బహులదశల ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసింది. రాష్ట్రంలో రికార్డు విస్తీర్ణంలో పంటలు సాగయ్యేలా కృషి చేసింది.

భాజపాపై యుద్ధభేరి.. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు, వాటికి వ్యతిరేకంగా రైతు ఆందోళనలు, రాష్ట్రాల పట్ల భాజపా అనుసరిస్తున్న వైఖరి నేపథ్యంలో కేసీఆర్​ దృష్టి మరోమారు జాతీయ రాజకీయాలపై పడింది. భాజపా సర్కార్ వైఖరి, విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మెుదట్లో ఎన్​డీఏతో సఖ్యతగానే ఉన్నా… రెండేళ్లుగా పూర్తిగా విభేదిస్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ విపక్షాల అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. వివిధ రాష్ట్రాల పర్యటనలకు వెళ్లి భాజపా, కాంగ్రెసేతర నేతలతో మంతనాలు జరిపారు. భాజపాకు వ్యతిరేకంగా బలంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. కొందరు నేతలు హైదరాబాద్ వచ్చి కేసీఆర్​తో సమావేశమయ్యారు.

దేశ రైతుసంఘాల నేతలను హైదరాబాద్ పిలిపించి రెండ్రోజులు చర్చించారు. పార్టీ ప్లీనరీలోనూ జాతీయ రాజకీయాల అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించిన గులాబీ బాస్‌… దేశ రాజకీయాల్లోకి వెళ్లాలా… వద్దా… అంటూ ప్రజల ఆమోదం తీసుకున్నారు. సందర్భం ఏదైనా భాజపా సర్కార్‌ను ఎండగట్టారు. తెలంగాణ నమూనా దేశవ్యాప్తంగా అమలు కావాలని… దేశంలో రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ప్రగతిశీల భారత్ ధ్యేయంగా కాంగ్రెస్, భాజపాతో సంబంధం లేకుండా ముందడుగు పడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాల అంశంపై ప్రధానంగా దృష్టి సారించిన కేసీఆర్… ఆ దిశగా కీలక అడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణ కోసం ఉన్న రాజకీయ పార్టీని ఇక దేశం కోసం నడిపించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా దేశానికి విస్తరించనుంది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles