24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

మోటర్లకు మీటర్లు కావాలో, ఉచిత విద్యుత్ కావాలో తేల్చుకోండి… మునుగోడులో మంత్రి కేటీఆర్!

హైదరాబాద్‌: వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్న మోదీ కావాలో, ఉచిత విద్యుత్, రైతుబంధుతో రైతుల్ని ఆదుకుంటున్న కేసీఆర్ కావాలో తేల్చుకోవాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గ రైతులు తమ తీర్పును ఓట్ల రూపంలో వెలువరించాలన్నారు.

మంగళవారం మునుగోడు నియోజకవర్గం రైతులతో టెలీకాన్ఫరెన్స్‌లో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు, గత ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్ హయాంలో రైతుల పరిస్థితిని పోల్చి చూడాలని కోరారు. దేశంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఏటా రూ.10,500 కోట్లు వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. రైతుబంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.58,000 కోట్లు ఖర్చు చేసిందని, రైతు బీమా కింద రూ.5 లక్షల బీమాను అందజేస్తోందని, ఇది వ్యవసాయ రంగ రూపురేఖలను మార్చిందని పేర్కొన్నారు.

కరోనా సంక్షోభ కాలంలోనూ ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల నుంచి ప్రతి ధాన్యపుగింజనూ కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని తెలిపారు. ఇప్పటిదాకా లక్షా 17వేల కోట్ల రూపాయలతో ధాన్యం, ఇతర పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన వివరించారు. ప్రభుత్వం మిషన్‌ భగీరథ కింద ఇంటింటికీ తాగునీరు అందించడమే కాకుండా వ్యవసాయ పొలాలకు సాగునీరు అందజేస్తోందని అన్నారు.

మీ వ్యవసాయ పొలాలకు సాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం లక్ష్మణపల్లె, కృష్ణరాయనిపల్లె, శివన్నగూడెం ప్రాజెక్టులను నిర్మిస్తోంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ కారణానికి మద్దతు ఇవ్వడానికి బదులు, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను ఖరారు చేయకుండా ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తోందని” మంత్రి అన్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం తన క్రోనీ క్యాపిటలిస్టు స్నేహితుల ప్రయోజనాల కోసం విద్యుత్ సరఫరా, పంపిణీని ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తోందని కేటీఆర్ రైతులను హెచ్చరించారు. ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలను ప్రైవేటీకరించిన తర్వాత పెట్రోల్‌, వంటగ్యాస్‌ ధరల తరహాలో విద్యుత్‌ చార్జీలు పెరుగుతాయని హెచ్చరించారు. బిజెపి  ప్రయత్నాలు సఫలమైతే, వ్యవసాయ పంపుసెట్‌ల వద్ద ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను బిగించి, ముందుగా బిల్లులు చెల్లించిన తర్వాత మాత్రమే విద్యుత్ అందిస్తారని చెప్పారు.

”కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పోరాడుతున్నారు, వీటిని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాలి. బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే బీజేపీ అభ్యర్థి రైతు వ్యతిరేక విధానాలకు ప్రజలు మద్దతిస్తున్నారని తెలుస్తోంది. కావున మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి రైతులు మద్దతిచ్చి టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles