23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలు.. హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్!

హైదరాబాద్‌: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపే లక్ష్యంతో హైదరాబాద్‌ పోలీసులు సోమవారం అన్ని కాలేజీల్లో డ్రగ్స్‌ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నిన్న మాట్లాడుతూ… ఉన్నత విద్యా సంస్థల్లో డ్రగ్స్‌ నిరోధక కమిటీల్లో కనీసం ఐదుగురు సభ్యులు ఉండాలని,అందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉండాలని కోరారు. అధ్యాపకులు, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టడం వల్ల డ్రగ్స్‌కు బానిసలుగా మారకుండా చూడవచ్చని అన్నారు.

మాదకద్రవ్యాల వైపు విద్యార్థులు మొగ్గు చూపకుండా, వివిధ పరిస్థితులను ఎదుర్కోవటానికి మానసికంగా సిద్ధం చేయడానికి ఈ కమిటీ పనిచేస్తుందని సీపీ చెప్పారు. మాదకద్రవ్యాల విషయంలో తోటివారి ఒత్తిడిని నిరోధించేందుకు అవసరమైన నైపుణ్యాలతో యువతకు శిక్షణ ఇవ్వడం చాలా అవసరం అన్నారు.

తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, తోటివారి ప్రభావం వల్ల యువత తరచూ చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలకు బానిసలు అవుతున్నారని ఆనంద్ వివరించారు. గత రెండేళ్లలో కొవిడ్​ మహమ్మారితో విద్యాకు అంతరాయం కలిగిందని, ఆ తర్వాత కళాశాలలు సాధారణ స్థితికి చేరుకున్నందున, యువకులను మరింత జాగృతం చేయడంతో పాటు, పోలీసులు చట్టపరమైన చర్యలను చేపట్టారు.

హైదరాబాద్ పోలీసులు రూపొందించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం పనిచేసే ఈ ఏడీసీలు (యాంటీ డ్రగ్ కమిటీలు) తమ క్యాంపస్‌లలో వివిధ డిజిటల్ ప్రచారాలు, వర్క్ షాప్‌లు, సెమినార్‌ల ద్వారా మాదకద్రవ్యాల దుర్వినియోగం, ప్రమాదాల గురించి అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది.  ఒక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి, తల్లిదండ్రులు, సిబ్బంది, విద్యార్థులు, ఏజెన్సీల మధ్య సహకార విధానాన్ని నిర్ధారించడానికి ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ వెంటనే సమావేశం నిర్వహించి డ్రగ్స్‌పై అవగాహన కల్పించాలని హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్ అన్నారు.

ఈ యాంటీ డ్రగ్ కమిటీలు మాదకద్రవ్యాల వినియోగం, కొనుగోలుపై సమాచారం ఇవ్వడానికి స్థానిక పోలీసులతో కూడా సంప్రదింపులు జరుపుతాయి. ఇక నగరంలో కానీ, మరెక్కడానైనా కాని మత్తుపదార్థాల వినియోగం, డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే హైదరాబాద్ పోలీస్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌కు 8712661601 లేదా 040-27852080కు తెలియజేయవచ్చు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles