28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

హల్ద్వానీలోని రైల్వే భూమిలో నివసిస్తున్న 4వేల మందికి తొలగింపు నోటీసులు

ఉత్తరాఖండ్: హల్ద్వానీలోని రైల్వే భూముల్లో నివసిస్తున్న 4,000 మంది తమ ఇళ్లను ఖాళీ చేయాలంటూ నోటీసులు అందాయి. ‘రైల్వే భూమిలో నిర్మాణాలను’ కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఉత్తరాఖండ్… హల్ద్వానీ జిల్లాలోని బన్‌భూల్‌పురా ప్రాంతంలో రైల్వే భూమిలో నివసిస్తున్న  4,000కు పైగా కుటుంబాలు, వీరిలో ఎక్కువ మంది ముస్లింలు నిరాశ్రయులు కానున్నారు.

ఉత్తరాఖండ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వును అనుసరించి హల్ద్వానీ రైల్వే స్టేషన్ సమీపంలోని అనధికార కాలనీలలో నివసిస్తున్న 4300 కంటే ఎక్కువ కుటుంబాలకు తొలగింపు నోటీసులు పంపడానికి రైల్వే సిద్ధంగా ఉంది. ఈ ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాలు చేయగా, సుప్రీంకోర్టు జనవరి 5న పిటిషన్‌ను విచారించనుంది.

ఈ ఆక్రమణలలో సుమారు 20 మసీదులు, తొమ్మిది దేవాలయాలు, పాఠశాలలు ఉన్నాయి.

ప్రభుత్వ చర్యను ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఈ ప్రాంతంలో మూడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా అది ఆక్రమణ ఎలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. AIMIM ఉత్తరాఖండ్ ప్రెసిడెంట్ నయ్యర్ కజ్మీ కూడా హల్ద్వానీని సందర్శించారు. అక్కడ రైల్వే భూముల్లో నివసిస్తున్న కుటుంబాలను కలుసుకుని,  వారికి తన పూర్తి సహకారాన్ని ప్రకటించారు.

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలోని బన్‌భూల్‌పురా ప్రాంత నివాసితులు పట్టణంలోని 29 ఎకరాల రైల్వే భూమిలోని ఆక్రమణలను తొలగించాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై…. హల్ద్వానీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుమిత్ హృదయేష్ నేతృత్వంలో, ఈ ప్రాంత వాసులు  సుప్రీంకోర్టును ఆశ్రయించారని AICC కార్యదర్శి ఖాజీ నిజాముద్దీన్ ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. దీనిపై జనవరి 5న సుప్రీంకోర్టు విచారణ జరుపనుందని తెలిపారు. భూమి నుండి ఆక్రమణలను తొలగించడం వల్ల 4,500 మంది ప్రజలు నిరాశ్రయులౌతారని, ఈ సమస్యను మానవీయ దృక్పథంతో తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ…. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి విజ్ఞప్తి చేసింది. “వారు 70 ఏళ్లుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. అక్కడ మసీదు, దేవాలయం, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ఒక పిహెచ్‌సి, 1970లో నిర్మించిన మురుగు కాలువ, రెండు ఇంటర్ కాలేజీలు, ఒక ప్రాథమిక పాఠశాల,” ఉన్నాయని నిజాముద్దీన్ చెప్పారు. ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఆక్రమణలు  పేరిట జరుగుతున్న తొలగింపును ఆపాలని ప్రధాని, రైల్వే మంత్రిత్వ శాఖ, ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నిజాముద్దీన్ భూమిపై రైల్వే శాఖ క్లెయిమ్‌ చేయడంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఈ భూమిలో  కొంత భాగాన్ని లీజుకు ఇచ్చారని చెప్పారు. “అది రైల్వే భూమి అయితే, రాష్ట్ర ప్రభుత్వం దానిని ఎలా లీజుకు ఇచ్చింది?” ఆయన ప్రశ్నించారు. బన్‌భూల్‌పురా ప్రాంతంలోని వేలాది మంది నివాసితులు ఆక్రమణలను తొలగించడాన్ని నిరసించారు. ఈ చర్య పేదలను నిరాశ్రయులను చేస్తుందని, పాఠశాలకు వెళ్ళే వారి పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుందని అన్నారు. ఆక్రమణల తొలగింపు వల్ల నష్టపోయే వారిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles