23.7 C
Hyderabad
Monday, September 30, 2024

ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు… రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం!

హైదరాబాద్: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా  రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 5 వేల లైబ్రరీలను స్థాపించడమే కాకుండా, 998 ప్రాథమికోన్నత పాఠశాలలతో సహా 2,732 ఉన్నత పాఠశాలల్లో పూర్తి స్థాయి సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. లైబ్రరీల ఏర్పాటులో భాగంగా… పాఠశాల విద్యాశాఖ ఒక్కో లైబ్రరీకి 120 పుస్తకాలు అందించాలని నిర్ణయించింది. నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బిటి) నుంచి ఈ పుస్తకాలను కొనుగోలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేసిన తర్వాత, ఈ పాఠశాలల్లో 6 లక్షల పుస్తకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖకు అనుమతినిచ్చింది. దీని ప్రకారం ఇటీవల ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణాలయం ద్వారా ఈ పుస్తకాలను ముద్రించే ప్రక్రియను ప్రారంభించారు. అదేవిధంగా విద్యార్థుల పఠన నైపుణ్యాన్ని పెంపొందించే పుస్తకాలను ఈ గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు.

కోవిడ్-19 మహమ్మారి కాలంలో డిజిటల్/ఆన్‌లైన్ అధ్యయనాలు, టెలివిజన్, కంప్యూటర్‌లపై ఆధారపడి విద్యార్థులు తమ పాఠాలను పూర్తిచేశారు. ఇప్పుడిప్పుడే భౌతిక తరగతులకు తిరిగి హాజరవుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు ప్రాథమిక పఠనం, రాయడం వంటి నైపుణ్యాల్లో లోటు కనబడింది. పాఠశాల విద్యార్థులలో ఈ నైపుణ్యాలను పునరుద్ధరించడానికి విద్యా శాఖ ‘తొలిమెట్టు’, ఫౌండేషన్ సహకారంతో  అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో వివిధ రకాల పుస్తకాలతో గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. లైబ్రరీలు ప్రారంభమైన తర్వాత, పాఠశాలలకు కనీసం 15 నిమిషాల పాటు లైబ్రరీ పీరియడ్ నిర్వహించాలని ఆదేశించారు.  లైబ్రరీలో అందుబాటులో ఉంచిన ఇతర పుస్తకాలతో పాటు సబ్జెక్టు పుస్తకాలను విద్యార్థులు చదివేలా చూడాలని విద్యాశాఖ ఉపాధ్యాయులను ఆదేశించింది. విద్యార్థులు ప్రాథమిక సామర్థ్య స్థాయిలను సాధించేలా చూడాలని కూడా వారిని ఆదేశించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles