31 C
Hyderabad
Tuesday, October 1, 2024

బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపు ఆరోపణలు!

న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు… రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై లైంగిక వేధింపు ఆరోపణలు చేశారు. అందుకు నిరసనగా  ఢిల్లీలోని జంతర్‌ మంతర్ దగ్గర ఆందోళన చేపట్టారు.

రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ , ‘బీజేపీ ఎంపీ’ బ్రిజ్ భూషణ్ సింగ్ క్రీడాకారులపై లైంగిక దోపిడీకి పాల్పడ్డారని మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆరోపించారు. చాలా ఏళ్లుగా ఈ లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతోందని, మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌తో పాటు మరికొందరు కోచ్‌లు వేధింపులకు పాల్పడినట్లుగా వినేష్‌ ఫోగాట్ తెలిపారు.  లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఓ మహిళా రెజ్లర్‌కు అండగా నిలిచేందుకే ధర్నాలో పాల్గొన్నట్లుగా తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా బాధితులే తనకు చెప్పారని .. పేర్లు బయటపెట్టడం సరికాదని వినేష్ ఫొగాట్ అన్నారు. ఈ ధర్నాలో ఆమె‌తో పాటు సంగీత ఫోగాట్, భజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్, సుమిత్‌ మాలిక్, సరితా మోరేతో పాటు 30మంది రెజ్లర్లు పాల్గొన్నారు. కాగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్  ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.

ఇదిలా ఉండగా నిరసన తెలుపుతున్న  రెజ్లర్లతో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం సమావేశం అయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు సమావేశం కొనసాగింది. బ్రిజ్ భూషణ్ రాజీనామా చేయాలని, రెజ్లింగ్ బాడీని రద్దు చేయాలని వారు డిమాండ్ చేసినట్లు సమాచారం. నేడు మరోసారి సమావేశం కానున్నారు.

ఈ విషయమై డబ్ల్యూఎఫ్‌ఐ త్వరగా స్పందించకుంటే, జాతీయ క్రీడాభివృద్ధి కోడ్‌లోని నిబంధనల ప్రకారం సమాఖ్యపై చర్యలు తీసుకునేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని కేంద్రం మొన్ననే ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా  కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు రెండింటిలోనూ స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ మాట్లాడుతూ…. ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి ‘సంతృప్తికరమైన సమాధానం’ రాలేదని అన్నారు.

“దురదృష్టవశాత్తూ మాకు సంతృప్తికరమైన స్పందన రాలేదు. నిన్న, మా మధ్య ఒకరిద్దరే బాధితులు ఉన్నారు, కానీ ఇప్పుడు మా దగ్గరికి 5-6 మంది రెజ్లర్లు వచ్చారు.  వారు వేధింపులకు గురయ్యారు (లైంగికంగా). మేము ఇప్పుడు వారి పేర్లు చెప్పలేము. వారి గుర్తింపును బలవంతంగా బహిర్గతం చేస్తే అది బ్లాక్ డే అవుతుంది” అని రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత వినేష్ గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

“మేము బ్రిజ్ భూషణ్ రాజీనామా కోరటం మాత్రమే కాదు. మేము అతనిని జైలుకు పంపుతాము. మేము చట్టపరమైన మార్గం తీసుకోదలచుకోలేదు, ఎందుకంటే మేము పరిష్కారం కోసం ఆశించాము, కానీ సరైన పరిష్కారం అందించకపోతే, మేము ఎఫ్ఐఆర్లను నమోదు చేస్తాము.  మేము ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఒలింపిక్ పతక విజేతలం, మమ్మల్ని అనుమానించకండి, మేము నిజం చెబుతున్నాము, మమ్మల్ని నమ్మండి.” అని వినేష్ అన్నారు.

ఎవరీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్..?

  • ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోండా జిల్లాలో జన్మించిన బ్రిజ్ భూషణ్ 1980ల్లో విద్యార్ధి రాజకీయాల్లోకి వచ్చారు.
  • ఆ తర్వాత రామజన్మభూమి ఉద్యమంలో భాజపా అగ్రనేత ఎల్.కే. అడ్వాణీతో కలిసి విస్తృతంగా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లారు. దీంతో స్థానికంగా బ్రిజ్ భూషణ్ పేరు మార్మోగింది.
  • 1991లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని గోండా నియోజకవర్గం నుంచి భాజపా (BJP) ఆయనకు టికెట్ ఇచ్చింది.
  • ఆ ఎన్నికల్లో విజయం సాధించిన బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు.
  • ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు.
  • కొన్ని కారణాలతో భాజపా నుంచి విడిపోయి సమాజ్వాదీ పార్టీలో చేరారు.
  • 2009లో ఎస్పీ అభ్యర్థిగా కైసర్ గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
  • అయితే 2014లో భాజపా గూటికి చేరిన ఆయన.. కైసర్ గంజ్ నుంచి మరోసారి విజయం సాధించారు.
  • 2019 ఎన్నికల్లోనూ వరుసగా మూడోసారి గెలిచి.. భాజపాలో బలమైన నేతగా మారారు.
  • 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం అతనిపై మరో మూడు పెండింగ్ కేసులు ఉన్నాయి.  హత్యాయత్నం, అల్లర్లు, దోపిడీ వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నాడు.
  • బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బ్రిజ్ భూషణ్ కూడా నిందితుడిగా ఉండగా.. 2020లో  ఆయనను కోర్టు నిర్దోషిగా తేల్చింది.

దశాబ్దానికి పైగా అధ్యక్షుడిగా..

పాత తరం కుస్తీ వీరులు జనార్ధన్ సింగ్. రామ్ ఆస్ట్రే, రామచంద్ర, గంగా ప్రసాద్ వంటి వారితో బ్రిజ్ భూషణ్‌కు సత్సంబంధాలున్నాయి. దీంతో 2011లో తొలిసారి భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 12 ఏళ్లుగా అదే హోదాలో కొనసాగుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై… వరుసగా మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles