23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

స్వీడన్, ఫిన్లాండ్‌తో త్రైపాక్షిక చర్చలను వాయిదా వేసుకున్న టర్కీ!

అంకారా: స్టాక్‌హోమ్‌లోని టర్కీ (తుర్కియా) రాయబార కార్యాలయం వెలుపల డానిష్ తీవ్రవాద నాయకుడు రాస్మస్.. ఖురాన్ దహనం చేసిన ఘటనపై టర్కీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన ఇస్తాంబుల్‌లో  నిరసనలకు దారితీసింది.  స్వీడన్-టర్కీ దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. స్వీడన్ నాటో  సభ్యత్వం సైతం డైలమాలో పడింది.

స్టాక్‌హోమ్‌లో ఖురాన్ కాపీని కాల్చడానికి స్వీడిష్ ప్రభుత్వం ముస్లింలను ద్వేషించే వ్యక్తిని అనుమతించడంతో… ఫిబ్రవరిలో జరగాల్సిన నార్డిక్ దేశాల NATO బిడ్‌పై ప్రభావం చూపనుంది. అదేసమయంలో స్వీడన్, ఫిన్‌లాండ్‌లతో జరగాల్సిన త్రైపాక్షిక సమావేశాన్ని టర్కీ వాయిదా వేసింది.

డెన్మార్క్‌కు చెందిన తీవ్రవాద స్ట్రామ్ కుర్స్ (హార్డ్ లైన్) పార్టీ నాయకుడు ‘రాస్మస్ పలుడాన్’ ఇటీవల ఖురాన్ కాపీని కాల్చి ముస్లింలను రెచ్చగొట్టారు.  ఈ ఘటన స్వీడిష్ రాజధానిలోని టర్కిష్ రాయబార కార్యాలయం ముందు మొన్నటి వారాంతంలో జరిగింది.

దీంతో పిబ్రవరిలో బ్రస్సెల్స్‌లో జరగాల్సిన సమావేశం అంకారా అభ్యర్థన మేరకు తదుపరి తేదీకి వాయిదా పడిందని టర్కీ దౌత్య వర్గాల సమాచారం. ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందనేది సంబంధిత వర్గాలు వెల్లడించలేదు. సోమవారం, అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్, సంఘటన తర్వాత స్వీడన్ తన NATO సభ్యత్వానికి టర్కీ (తుర్కియా) మద్దతును ఆశించకూడదని అన్నారు.

“మా దౌత్యకార్యాలయం ముందు ఇంత అవమానకర ఘటనకు కారణమైన వారు తమ నాటో సభ్యత్వ దరఖాస్తులకు సంబంధించి మా నుండి ఎలాంటి దయాదాక్షిణ్యాలను ఆశించకూడదు” అని రాజధాని అంకారాలో జరిగిన క్యాబినెట్ సమావేశం తర్వాత టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అన్నారు.

నాటో (NATO) అప్లికేషన్లు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల “మత విశ్వాసాలకు గౌరవం చూపకపోతే”, స్వీడన్ NATO బిడ్‌కు ‘అంకారా’ నుండి ఎటువంటి మద్దతు లభించదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అన్నారు. స్వీడన్ నుండి 100 మందికి పైగా వాంటెడ్ వ్యక్తులను అప్పగించాలని టర్కీ గతంలో డిమాండ్ చేసింది.

స్వీడిష్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ నిన్న మాట్లాడుతూ… స్టాక్‌హోమ్ నాటోలో చేరే అంశంపై  అంకారాతో తిరిగి చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. NATOలో చేరకపోతే స్వీడన్‌కు భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయని ఆయన అన్నారు. అంతకుముందు రోజు, ఫిన్నిష్ విదేశాంగ మంత్రి పెక్కా హావిస్టో … తన దేశం స్వీడన్ లేకుండా నాటోలో చేరవలసి ఉంటుందని సూచించారు.

స్వీడన్, ఫిన్లాండ్ అధికారికంగా మేలో NATOలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాయి, దశాబ్దాల సైనిక నాన్-అలైన్‌మెంట్‌ను విడిచిపెట్టాయి, ఈ నిర్ణయం ఉక్రెయిన్‌పై రష్యా  యుద్ధం కారణంగా వెలువడింది. ఏ దేశమైనా NATOలో చేరాలంటే సభ్య దేశాల ఏకగ్రీవ ఆమోదం తప్పనిసరి.

70 సంవత్సరాలకు పైగా NATO సభ్యుడిగా ఉన్న టర్కీ… స్వీడన్, ఫిన్లాండ్ నాటో దరఖాస్తులపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. రెండు దేశాలు కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (Partiya Karkeren Kurdistan-PKK) తో సహా మిగతా తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు.

టర్కీ, అమెరికా, యురోపియన్ యూనియన్‌లచే తీవ్రవాద సంస్థగా గుర్తించిన PKK – టర్కీకి  వ్యతిరేకంగా 35 ఏళ్లుగా  తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తద్వారా టర్కీలో మహిళలు, పిల్లలు,శిశువులతో సహా 40,000 మందికి పైగా మరణాలకు కారణమైంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles