33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఏలూరులో జూట్‌మిల్‌ మూసివేత… వేలాది కార్మికుల ధర్నా!

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ‘శ్రీ కృష్ణా జూట్ మిల్లును‘ చట్టవిరుద్ధంగా, అప్రకటితంగా మూసివేయడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు గురువారం మిల్లు గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. 118 ఏళ్ల చరిత్ర కలిగి.. వేలాది కార్మికులకు ఉపాధి కల్పించిన ఏలూరు శ్రీ కృష్ణా జూట్‌మిల్‌ మూత పడటాన్ని కార్మికులు అసలు జీర్ణించుకోలేక పోతున్నారు. రోజుకు ఎనిమిది టన్నుల ఉత్పత్తి నుంచి 140 టన్నులు ఉత్పత్తి చేసే కర్మాగారంగా పేరుపొందింది. మంచి సామర్థ్యంతో నడుస్తున్న ఈ మిల్లు అకస్మాత్తుగా ముడిసరుకు కొరత వల్ల మూసేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఏడు దశాబ్దాలపాటు జూట్‌మిల్‌ను ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ.. వేలాది మంది కార్మికులకు తోడూనీడగా వున్న నాటి మేనేజింగ్‌ డైరెక్టర్‌ బ్రిజ్‌గోపాల్‌ లునానీ మరణించి ఏడాది కాకుండానే ఫ్యాక్టరీ ఇలా అర్ధంతరంగా నిలిచిపోవడం కార్మికులకు అసలు మింగుడు పడటం లేదు. నిత్యం రెండు వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తోన్న కృష్ణాజూట్‌మిల్‌ను అప్రకటితంగా మూసివేయడాన్ని నిరసిస్తూ మిల్లు నుంచి కార్మికులంతా ర్యాలీగా బయలుదేరి అశోక్ నగర్లో కార్మిక కార్యాలయానికి చేరుకుని ధర్నా చేసి అనంతరం ‘జేసీఎల్‘కు వినతిపత్రం సమర్పించారు. యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని జేసీఎల్ హామీ ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం ఎటువంటి కార్మిక చట్టాలను పాటించకుండా జనపనార రేటు పెరిగిందనే సాకుతో మూసివేయడం సరికాదన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్ హిమాన్సు శుక్లా కార్మిక సంఘాలతో కలెక్టరేట్లో గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు.
కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ లేబర్‌ కమీషన్‌, మంత్రులు, జిల్లా కలెక్టర్‌, ఇతర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి యాజమాన్యంతో చర్చలు జరిపి మిల్లును తిరిగి తెరిపించేలా చూస్తామన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles