33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు… నూతన జిల్లాలను లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు నేటినుంచి ఉనికిలోకి వచ్చాయి. నేటి ఉదయం  సీఎం జగన్‌ నూతన జిల్లాలను లాంఛనంగా ప్రారంభించారు. దీంతో కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో పరిపాలన ప్రారంభం అయింది. నిన్నటివరకు రాష్ట్రంలో 13 జిల్లా ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటుచేయడంతో వాటి సంఖ్య 26కు పెరిగింది. ఇప్పటివరకు ఉన్న 51 డివిజన్ల సంఖ్యను 73కి పెంచింది. కాగా, 42 ఏళ్ల తర్వాత ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటయ్యాయి. చివరిసారిగా 1979లో విజయనగరం జిల్లాను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సోమవారం తాడేపల్లి కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కొత్త జిల్లాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఎలక్ట్రానిక్‌ బటన్‌ నొక్కడం ద్వారా కొత్త జిల్లాల ఉనికి అమల్లోకి వచ్చింది. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి సందేశమిచ్చారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల కార్యాలయాల ద్వారా సేవలందించేందుకు .. ఆయా జిల్లాలకు చేరుకున్న ఉద్యోగులందరికీ  సిఎం జగన్‌ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.  ప్రభుత్వం ఇప్పటికే కొత్త జిల్లాకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన విషయం తెలిసిందే. అదేవిధంగా 26 జిల్లాలకు 26 మంది జిల్లా రెవెన్యూ అధికారులను కూడా నియస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.

ఇక, ఏపీలో కొత్తగా 26 జిల్లాలను ప్రతిపాదిస్తూ ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్లు జారీచేసింది. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలను విభజించింది. ఈ ప్రకారం.. 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ..  విస్తీర్ణం దృష్ట్యా అరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలుగా విభజించింది. దీంతో మొత్తం 26 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. వాటిపై సమీక్షించిన ప్రభుత్వం.. స్వల్ప మార్పులతో కొత్త జిల్లాలను ఖరారు చేసింది.

ప్రాథమిక నోటిఫికేషన్‌లో ప్రతిపాదించిన మేరకు కొత్త జిల్లాల పేర్లను ప్రభుత్వం దాదాపు అలాగే ఉంచింది. తిరుపతి కేంద్రంగా ప్రతిపాదించిన బాలాజీ జిల్లాను మాత్రం అక్కడి ప్రజల కోరిక మేరకు తిరుపతి జిల్లాగా పేరు మార్చింది. మన్యం జిల్లాకు బదులుగా పార్వతీపురం మన్యం అనే పేరు ఖరారు చేశారు.   పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, అనకాపల్లి, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, బాపట్ల, ఎన్టీఆర్‌ పరిపాలన సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ అవసరాన్ని, స్వాతంత్య్ర సమరయోధులను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాలకు పేర్లు పెట్టినట్లు తెలిపారు.

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా పాత జిల్లా పరిషత్‌ల విధానమే కొనసాగనుంది. ప్రస్తుత జెడ్పీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల పదవీకాలం ముగిసే వరకు పాత జిల్లాల విధానంలోనే ఆయా పదవుల్లో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాలుగో తేదీ నుంచి ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ప్రస్తుత జిల్లా ప్రజా పరిషత్‌ల పదవీ కాలం ముగిసే వరకు పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం వాటి పరిధి, అధికారాలపై కొత్త జిల్లాల ఏర్పాటు ఎలాంటి ప్రభావం చూపదు అని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles