23.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

అన్నక్యాంటిన్‌ను ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తలు… కుప్పంలో రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు!

తిరుపతి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండో రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్‌ను.. వైసీపీకి కార్యకర్తలు కొందరు ధ్వంసం చేశారు.  అలాగే అక్కడ ఏర్పాటు చేసిన.. ఫ్లెక్సీలను కూడా చించేశారు. విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.

టీడీపీ కార్యాలయంపై కూడా వైసీపీ శ్రేణులు దాడకి దిగాయి. ఈ సమయంలో చంద్రబాబునాయుడు గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఈ  ఘటనలను టీడీపీ నేతలు చంద్రబాబుకు వివరించారు. ఆయన గెస్ట్ హౌస్ నుండి కాలినడకన అన్న క్యాంటిన్ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఉన్న రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.

ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ ఘటనలో  టీడీపీ సీనియర్ నేత పి మనోహర్‌తో పాటు, టీడీపీ కార్యకర్త చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు నయీం తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తల దాడికి నిరసనగా మాజీ సీఎం చంద్రబాబు ధర్నాకు దిగారు. ఇది కుప్పం చరిత్రలోనే చీకటి రోజని.. మనం ప్రజాస్వామ్యమంలో ఉన్నామా అంటూ ప్రశ్నించారు. కుప్పంలో ఎప్పుడైనా రౌడీయిజం చూశామా అని ప్రశ్నించారు చంద్రబాబు. పోలీసుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.. పోలీసులు సీఎం చేతిలో కీలుబొమ్మలు మారిపోయారని మండిపడ్డారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఎస్పీ ఎక్కడ ఉన్నారు? ఆయన ఏమి చేస్తున్నారు? మీకు 60 వేల మంది పోలీసులు ఉండవచ్చు, కానీ నాకు 60 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మాకు స్పందించడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. మేము అలాంటి పనులు చేయము,” అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. అన్నా క్యాంటీన్ కూల్చివేతకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్‌కు కాకుండా వారి ఇళ్లకు తీసుకెళ్లారని ఆయన పోలీసులను తప్పుబట్టారు.

కుప్పంలో జరుగుతున్న మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ శ్రేణులు ఇచ్చిన పిలుపుతో ప్రైవేటు విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆర్టీసీ బస్సులు కుప్పం డిపోలోనే ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం బస్సు సర్వీసులను రద్దు చేసి నేడు కుప్పంలో పాఠశాలలను మూసివేయడం ఎంత ధైర్యం అని చంద్రబాబు ప్రశ్నించారు. అధికార పార్టీ పతనం ఈరోజు మొదలైంది కుప్పం నుండే టీడీపీ ‘ధర్మ పోరాటం’ ప్రారంభించింది అని టీడీపీ చీఫ్ అన్నారు.

ఈ ప్రభుత్వం పేద ప్రజలకి అన్నం పెట్టదు. ఇంకొకళ్ళని పెట్టనీయదు. అన్ని దానాలలోకి అన్నదానం మహాగొప్పది. కనుక అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేద ప్రజల కడుపులు నింపుతున్నారు మనవాళ్ళు. కానీ ఇక్కడ అన్నాక్యాంటీన్ పెట్టబోతుంటే దానిని అడ్డుకొంటారా?మీరు ఎక్కడైతే అడ్డుకొన్నారో మళ్ళీ అక్కడే అన్నా క్యాంటీన్ పెడతాం. ఎవరు అడ్డుకొంటారో నేను చూస్తా అని చంద్రబాబు ఆవేశంగా అన్నారు.

అనంతరం పట్టణంలో పునరుద్ధరించిన పార్టీ కార్యాలయాన్ని నాయుడు ప్రారంభించి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముమ్మరంగా సమావేశాలు నిర్వహించారు. ఇటీవలి కాలంలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న నాయకులతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పలువురు తటస్థులను కూడా ఆయన కలిశారు. కాగా, రామకుప్పం మండలంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త గణేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సహా పలువురు టీడీపీ నేతలపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరో 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles