28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించడంపై ప్రభుత్వం నిషేధం!

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించడాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. జాతీయ రహదారుల నుంచి పంచాయతీ రాజ్ రోడ్ల వరకు ఈ నిషేధం వర్తించనుంది. దీనికి ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బంది కలగని ప్రదేశాల్లో.. అత్యంత అరుదైన సందర్భాల్లోనే షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని రాష్ట్ర హోం శాఖ స్పష్టం చేసింది. షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహించిన బహిరంగ సభల్లో తొక్కిసలాట జరిగి భారీగా ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై సభలు, రోడ్‌షోలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ప్రతిపక్షాల వ్యూహాలకు ముఖ్యమంత్రి చెక్‌ పెట్టేయడంతో రాజకీయంగా కలకలం రేగుతోంది.

రాజకీయ పార్టీలకు షాక్….
సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నాయి. జనవరి చివరి వారంలో నారా లోకేష్‌ యువగళం పేరుతో పాదయాత్రను ప్రకటించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై యుద్దానికి సిద్ధమంటూ కొద్ది రోజుల క్రితం తన ప్రచార వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు పవన్ కళ్యాణ్ రూట్‌ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు కోసం ఏర్పాటు చేసిన రెండు కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం జరగడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోవైపు రాజకీయ పార్టీలు రోడ్లపై నిర్వహిస్తున్న కార్యక్రమాలతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముందస్తు ప్రకటన లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేయడం వల్ల జాతీయ రహదారులు, ఆర్‌ అండ్‌ బి రోడ్లపై ప్రయాణించే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై గతంలో కూడా విమర్శలు వ్యక్తమైనా ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించింది.

ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ జారీ చేసిన జీవో నంబర్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి బోలెడు ప్రయోజనాలు ఉండబోతున్నాయి. ఓ వైపు ప్రజల ఇక్కట్లకు చెక్‌ చెబుతూనే పార్టీలను కట్టడి చేసే వ్యూహం అనుసరించింది. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మునిసిపల్, పంచాయితీ రోడ్లపై ర్యాలీలు, సభల్ని నిషేధిస్తే పార్టీలకు ఇకపై పరిమితంగా సభలు మాత్రమే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని ప్రణాళికలు వేసుకుంటున్న జనసేన, టీడీపీ వంటి పార్టీలకు అశనిపాతం అవుతుంది. ఏడాది పొడవున ప్రజల్లో ఉండేందుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు ఇకపై ఖాళీ ప్రదేశాల్లో సభలు పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక సభలకు జన సమీకరణ కూడా పార్టీలకు తలకు మించిన భారం అవుతుంది. అధికారంలో ఉన్న పార్టీకి సభల నిర్వహణ పెద్ద సమస్య కాకపోయినా ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలకు తలకు మించిన భారం అవుతుంది. ఇవన్నీ ఆలోచించే రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపై ర్యాలీలు నిషేధించింది.

ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ అధినేత కూడా పాదయాత్రలతోనే ప్రజలకు చేరువ అయ్యారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆ ఛాన్స్‌ లేకుండా కఠిన ఆంక్షలు విధించడంపై, పార్టీలు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశాలు కూడా లేకపోలేదు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles