24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

గాజాలో మృతుల సంఖ్య 8వేలు దాటింది…రెండో దశ యుద్ధం మొదలైందన్న ఇజ్రాయెల్!

జెరుసలెం: ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఘర్షణ మొదలై మూడు వారాలు దాటింది. గ‌డిచిన 24 గంట‌లుగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాల వ‌రుస దాడుల‌తో గాజా స్ట్రిప్ నిలువెల్లా వ‌ణుకుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 8,000 దాటిందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 3,300 మంది మైనర్లు, 2,000 మందికిపైగా మహిళలు ఉన్నారని ప్రకటించింది. శిథిలాల కింద మరో 1,700 మంది చిక్కుకుపోయినట్లు అంచనా.

ఖాన్ యూనిస్ సిటీలో ఓ భవనంపై జరిగిన వైమానిక దాడిలో 13 మంది మరణించారు. వీరిలో 10 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. హమాస్ కమాండ్ పోస్టు ఉందని భావిస్తున్న షిఫా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. గాజా సిటీలో ఇదే అతిపెద్ద ఆసుపత్రి. ఇక్కడ వందలాది మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఎంతమంది బలయ్యారన్నది తెలియరాలేదు.

బాంబు దాడులు తీవ్రతరం కావడం పాలస్తీనియన్లలో గుబులు పుట్టిస్తోంది, ఇలాంటి భీకర దాడులను తామెప్పుడూ చూడలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బాంబుదాడుల ఫలితంగా గాజాలో కమ్యూనికేషన్‌ వ్యవస్థలు బాగా దెబ్బతిన్నాయి. 2.3 మిలియన్ల మందికి ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయాయి. ఆదివారం తెల్లవారుజామున గాజాలోని కొన్ని ప్రాంతాలకు కమ్యూనికేషన్‌లు పునరుద్ధరించారు.

కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్‌తో సహా హక్కుల సంస్థలకు యుద్ధ నేరాలు, ఇతర దుర్వినియోగాలను నమోదు చేసే ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తోందని హెచ్చరించాయి.

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో హమాస్ దాడి నేపథ్యంలో 2.3 మిలియన్ల జనాభా ఉన్న పాలస్తీనా ఎన్‌క్లేవ్‌పై ఇజ్రాయెల్ ముట్టడిని విధించింది. ఇజ్రాయెల్ దళాలు తరచూ బాంబు దాడులకు తెగబడడంతో ఎన్‌క్లేవ్‌లో ఆహారం, నీరు, ఇంధనం, ఔషధాలు లభ్యం కావడం బాగా కష్టమవుతోంది.

“గాజాలో పరిస్థితి గంట గంటకు మరింత దిగజారుతోమంది. అంతర్జాతీయ సమాజం మద్దతుతో గాజాలో ఎంతో కొంత సాయం చేద్దామనుకుంటే  ఇజ్రాయెల్ నిరంతర బాంబుదాడుల కారణంగా  గాజా వాసులకు చిన్నపాటి సాయం కూడా చేయలేకపోతున్నందుకు నేను చింతిస్తున్నాను, ”అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ నేపాల్ రాజధాని ఖాట్మండు పర్యటన సందర్భంగా అన్నారు.

రెండో దశ యుద్ధం
గాజాపై రెండో దశ యుద్ధం ప్రారంభించామని.. హమాస్‌ సైనిక, ప్రభుత్వ సామర్థ్యాలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. భూతల, గగన, జల మార్గాల ద్వారా దాడులు కొనసాగిస్తామని తెలిపారు. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా ఇప్పటివరకు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇజ్రాయల్‌ వద్ద బందీగా ఉన్న పాలస్తీనియన్లందరినీ విడిచిపెడితే తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ పౌరులను విడిచి పెడతామని హమాస్‌ అగ్రనేతలు చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్‌ సైన్యం తిరస్కరించింది. ఇప్పటి వరకు కాస్త సురక్షిత ప్రాంతంగా భావిస్తున్న ఉత్తర గాజాపైనా ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించింది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles