30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

అట్టహాసంగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్!

పారిస్‌: పదహారు రోజులపాటు ప్రపంచ క్రీడాభిమానులను అమితంగా అలరించిన విశ్వ క్రీడా సంబరం పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడలు అట్టహాసంగా ముగిసాయి. ఫ్రెంచ్‌ భాషలో మెర్సీ పారిస్‌ (థ్యాంక్యూ పారిస్‌) లాస్‌ ఏంజెల్స్‌కు వెల్‌కమ్‌ అంటూ క్రీడాకారులు సెలవు తీసుకున్నారు. ఫ్రెంచ్‌ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలా సాగిన ముగింపు వేడుకలు వీక్షకులను అబ్బురపరచాయి.

ముగింపు సంబరాల్లో కళ్లు మిరుమిట్లు గొలిపే లేజర్‌ కాంతులతో బాటు సంప్రదాయ బద్ధమైన నృత్యాలు, రకరకాల కళా రూపాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. ముగింపు సందర్భంగా జరిగిన క్రీడాకారుల మార్చ్‌పాస్ట్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని హాకీ గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌, యువ షూటర్‌ మను భాకర్‌ చేబూని ముందు నడవగా, మిగతా క్రీడాకారులు వారిని అనుసరించారు.

ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్‌ కమిటీ (IOC) అధ్యక్షుడు థామస్ బాచ్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఫ్రెంచ్ గాయకుడు- పాటల రచయిత జాహో డి సాగజాన్ ‘సౌస్ లే సియెల్ డి ప్యారిస్’ పాట పాడి అలరించారు. ఫ్రెంచ్ స్విమ్మర్ లియోన్ మార్చాండ్ పారిస్‌లోని జార్డిన్ డెస్ టుయిలరీస్‌లో ఒలింపిక్ జ్యోతిని మోసుకెళ్లగా.. వివిధ దేశాల అథ్లెట్లు తమ దేశ పతాకాలను మోసుకుంటూ కవాతు చేశారు. అభిమానులు సైతం ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పారిస్‌ ఒలింపిక్స్‌ ముగింపును పురస్కరించుకుని ఒలింపిక్‌ పతాకాన్ని అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం(ఐఓసి) అధ్యక్షులు థామస్‌ బాచ్‌ తదుపరి ఒలింపిక్స్‌కు ఆతిధ్యమిచ్చే లాస్‌ ఏంజెల్స్‌ నిర్వాహకులకు అందజేశారు.

జులై 26న పారిస్‌ నగరంలోని సీన్‌ నదిలో ప్రారంభమైన విశ్వక్రీడలు ఆగస్టు 11 రాత్రి జరిగిన ముగింపు వేడుకలతో పూర్తయ్యాయి. 14రోజుల పాటు సాగిన ఈ విశ్వక్రీడల్లో 206 దేశాలనుంచి 10,714 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

పారిస్‌ ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో అమెరికా మరోసారి అగ్రస్థానం అందుకుంది. 40స్వర్ణ, 44రజత, 42కాంస్యాలతో సహా మొత్తం 126 పతకాలతో అగ్రస్థానంలో నిలువగా.. చైనా 40స్వర్ణ, 27రజత, 24కాంస్యాలతో 91 పతకాలతో రెండోస్థానంలో నిలిచింది.

ఇక 117మంది అథ్లెట్లతో పారిస్‌లో అడుగిడిన భారత్‌.. కేవలం 6పతకాలకే పరిమితమైంది. గత ఒలింపిక్స్‌ కంటే ఈసారి ఒక పతకం తగ్గింది. మొత్తంగా పట్టికలో 71వ స్థానంలో నిలిచింది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles