33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘ట్విట్టర్​’ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్!

న్యూయార్క్: విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ ప్రముఖ అంతర్జాతీయ సామాజిక మాధ్యమం ‘ట్విట్టర్​’ను కొనుగోలు చేశారు.  ట్విట్టర్ బోర్డుతో ఎలాన్ మస్క్ చర్చలు సఫలమయ్యాయి. దాదాపు 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ డీల్ కుదుర్చుకున్నారు. సోమవారం ఉదయం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో ట్విట్టర్​ బోర్డు జరిపిన చర్చలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి.

ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన మస్క్.. వాక్‌ స్వాతంత్య్రం, స్వేచ్ఛగా అభిప్రాయాల వ్యక్తీకరణ కోసం వేదికగా ఏర్పాటైన ట్విటర్‌ ప్రస్తుతం ఆ లక్ష్యాలకు విరుద్ధంగా పనిచేస్తోందంటూ కొన్నాళ్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ట్విటర్‌లో వాటాదారుగా మారితే సంస్థను చక్కదిద్దవచ్చన్న ఉద్దేశంతో రెండు వారాల క్రితమే 9.2 శాతం వాటాలను 2.9 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు.   ప్రస్తుతం సంస్థ మొత్తాన్నీ తన అధీనంలోకి తీసుకున్నారు.

కొనుగోలు ఒప్పందం గురించి మస్క్‌తో ట్విటర్‌ బోర్డు కొన్నాళ్లుగా విస్తృత చర్చలు జరుపుతోంది. ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున మొత్తం 46.5 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమని మస్క్‌ గతవారం ప్రకటించారు. వాక్‌ స్వాతంత్య్రానికి మరింత అనువైన వేదికగా దాన్ని తీర్చిదిద్దుతానని ఉద్ఘాటించారు. కొనుగోలు ఒప్పందం వార్తల నేపథ్యంలో ట్విటర్‌ షేరు సోమవారం 3 శాతం పెరిగింది. ట్విటర్‌ కొనుగోలు నిధులను బ్యాంకుల ద్వారా మస్క్‌ సమకూర్చుకున్నట్లు ‘ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ పేర్కొంది.

“ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛా ప్రసంగం పునాదిగా ఉంటుంది. ట్విట్టర్ అనేది డిజిటల్ ప్లాట్‌ఫామ్. ట్విట్టర్ వేదికలో  మానవాళికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి” అని ఎలాన్ మస్క్ సోమవారం ఒక ప్రకటనలో తెలుపుతూ ట్వీట్ చేశారు. ట్విట్టర్ కంపెనీకి  అద్భుతమైన సామర్థ్యం ఉంది. ట్విట్టర్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని మస్క్ అన్నారు.

అనిశ్చితి ఖాయం!
ఈ సందర్భంగా జరిగిన ఇంటెరాక్షన్‌లో ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్  ట్విటర్ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విటర్‌ ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుండడంతో.. సోషల్‌ మీడియా కంపెనీలో అనిశ్చితి నెలకొనడయం ఖాయమని ఆయన వ్యాఖ్యానించాడు.
ఎలన్ మస్క్ చేతికి పగ్గాలు అప్పగించాక.. అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ ట్రంప్‌పై విధించిన ట్విటర్‌ నిషేధం ఎత్తేస్తారా? అనే ప్రశ్నకు పరాగ్‌ బదులిస్తూ..  ‘ఒకసారి డీల్‌ ముగిశాక.. ప్లాట్‌ఫామ్‌ పయనం ఎటువైపు ఉంటుందో మేం చెప్పలేం. కానీ, ఒక ప్రైవేట్‌ వ్యక్తి చేతుల్లోకి వెళ్తే.. అనిశ్చితి నెలకొనడం మాత్రం ఖాయం. ఒకవేళ ఎలన్‌తో మాట్లాడేటప్పుడు దీనికంటూ(ట్రంప్‌పై నిషేధం ఎత్తివేత) ఓ సమాధానం దొరకవచ్చు’ అని పేర్కొన్నాడు. అలాగే.. ఈ కీలక సమయంలో లేఆఫ్‌లు ఉండబోవని ఉద్యోగులకు గ్యారెంటీ ఇచ్చాడాయన.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles