28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

యూకే పీఎం రేసులో ‘రిషి సునాక్‌’ ముందంజ!

లండన్:  బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న మాజీ మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ మరింత ఆధిక్యం సాధించారు. కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీల తాజాగా జరిగిన మూడో రౌండ్​ ఓటింగ్​లో 115 ఓట్లతో నలుగురు అభ్యర్థుల్లో అగ్రస్థానంలో ఆయన ఉన్నారు. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్‌ 82 ఓట్లతో రెండో స్థానంలో, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రుస్‌ 71 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కెమి బడెనోచ్‌కు 58 ఓట్లు వచ్చాయి.

తదుపరి విడత ఓటింగ్‌ మంగళవారం జరగనుంది. దానిలో మరింత వడపోత జరుగుతుంది. గురువారం నాటికి బరిలో ఇద్దరే మిగులుతారు. ఆ తర్వాత 1,60,000 మంది అర్హులైన కన్జర్వేటివ్‌ పార్టీ ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ప్రధానిని ఎన్నుకుంటారు. విదేశాంగ శాఖ కమిటీ ఛైర్మన్​ టామ్​ తుగెన్‌ధాట్ 31 ఓట్లు సాధించి పోటీ నుంచి నిష్క్రమించారు.

అంతకుముందు గురువారం నిర్వహించిన రెండో దశ ఎన్నికలో అత్యధికంగా 101 మంది ఎంపీలు సునాక్‌కు మద్దతు తెలిపారు. రెండో రౌండ్​లో సునాక్​ తర్వాత.. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ (83 ఓట్లు), విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ (64 ఓట్లు), మాజీ మంత్రి కెమీ బదెనోచ్ (49 ఓట్లు), టోరీ బ్యాక్‌బెంచర్ టామ్ తుగెన్‌ధాట్ (32 ఓట్లు) వరుసగా నిలిచారు. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి ఆటార్నీ జనరల్‌ సుయెలా బ్రవెర్మన్‌.. రెండో రౌండ్​లో 27 ఓట్లు రావడం వల్ల పోటీ నుంచి నిష్క్రమించారు.

కాగా… మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌… రిషి సునాక్‌ ప్రధానమంత్రి కాకుండా అంతర్గంగా ప్రచారం చేస్తున్నారు. బ్రిటన్‌ ప్రధాని ఎన్నికల్లో మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్‌ను ఎలాగైనా ఓటమిపాలు చేసేందుకు తాత్కాలిక ప్రధాని తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్‌కు తప్ప మరెవరికైనా మద్దతు తెలపండి అంటూ బోరిస్‌ జాన్సన్‌ ఎంపీలకు సూచించినట్లు ఓ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

మిగిలిన నలుగురు అభ్యర్థులు మంగళవారం నాల్గవ రౌండ్ ఓటింగ్‌లోకి ప్రవేశిస్తారు. చివరికి  ఇద్దరు అభ్యర్థులు మిగులుతారు.  బుధవారం ఈ ఓటింగ్ ఉంటుంది.  వారు దేశవ్యాప్తంగా టోరీ పార్టీ సభ్యుల మద్దతు కోసం ప్రచారం చేస్తారు.

రిషి మంచి ప్రధాని అవుతారు!
భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ బ్రిటన్‌కు మంచి ప్రధాని కాగలరని కన్జర్వేటివ్‌ పార్టీ ఓటర్లలో 48 శాతం అభిప్రాయపడుతున్నట్టు జేఎల్‌ పార్టనర్స్‌ సంస్థ సర్వేలో తేలింది. రిషి అత్యధికుల్ని ఆకర్షిస్తున్నారని జేఎల్‌ పార్టనర్స్‌ సహ వ్యవస్థాపకుడు జేమ్స్‌ జాన్సన్‌ చెప్పారు.

సెప్టెంబరు 5న తుది ఎన్నిక.. బ్రిటన్‌ నూతన ప్రధానిని కన్జర్వేటివ్‌ పార్టీ ఈ ఏడాది సెప్టెంబరు 5న ఎన్నుకోనుంది. కన్జర్వేటివ్‌ పార్టీ అధినేతగా ఎన్నికైనవారే బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారు. కన్జర్వేటివ్‌ హోం వెబ్‌సైట్‌ తమ పార్టీలో నిర్వహించిన ఓ సర్వే- సునాక్‌ మూడో స్థానానికి పరిమితమవుతారని అంచనా వేసింది. పెన్నీ మోర్డాంట్‌ ప్రధాని పీఠం దక్కించుకుంటారని జోస్యం చెప్పింది. బదెనోచ్‌, సునాక్‌, బ్రవెర్మన్‌ వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలుస్తారని తెలిపింది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles