24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘మండి’పోతున్న లండన్‌… బ్రిటన్‌లో భానుడి భగభగ… అల్లాడుతున్న జనం!

 లండన్: బ్రిటన్‌పై సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా మంగళవారం లింకన్‌షైర్‌లోని కోనింగ్స్‌బైలో 40.3 డిగ్రీలు, లండన్‌ నగరంలోని హీత్రో ప్రాంతంలో 40.2 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఆగ్నేయ  ఇంగ్లాండ్‌లోని సర్రేలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  బ్రిటన్‌లో వాతావరణ రికార్డుల నమోదు ప్రారంభమైనప్పటి నుండి ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డవలేదని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం రాత్రి నమోదైన 26 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా రికార్డేనని వెల్లడించింది. ఇంగ్లండ్‌లో 2019లో నమోదైన 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతే ఇప్పటివరకూ రికార్డుగా ఉండేది.

ఉష్టోగ్రత తాకిడికి లండన్‌లోని ఇళ్లు, భవనాల్లో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు.  భ్రిటన్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా నమోదైన ఈ ఉష్ణోగ్రతలను “సంపూర్ణ నరకం”గా యూకే అగ్నిమాపక సిబ్బంది అభివర్ణించారు. ఎండదెబ్బకు ప్రజల్ని ఇళ్లనుంచి ఖాళీ చేయించారు. అస్వస్థత గురైన ప్రజలను ఆసుపత్రికి తరలించారు. లండన్‌లో ఉష్ణోగ్రతలు 40C (104F) చేరడం ఇదే మొదటిసారి అని లండన్ ఫైర్ బ్రిగేడ్ (LFB) ప్రకటించింది.

ఈ పరిస్థితిని “క్లిష్టమైనది”గా లండన్‌ మేయర్ సాదిక్ ఖాన్ అభివర్ణించారు. పార్కులు, ప్రైవేట్ గార్డెన్‌లతో పాటు డాబాలు, బాల్కనీలతో సహా ఈ రోజు, రేపు లండన్‌లో ఎక్కడైనా ప్రజలు బార్బెక్యూలు చేయకూడదని అన్నారు.

లండన్‌ మేయర్‌ స్కై న్యూస్‌తో మాట్లాడుతూ… ఉష్ట్రోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ప్రమాదం పొంచివుంది కాబట్టి “ఇది పార్టీలు చేసుకునే టైమ్‌ కాదు, ఎండ వేడికి మంటలు వేగంగా వ్యాపిస్తాయి కావున, మీ తోట, డెక్కింగ్, ఇళ్ళనుంచి ప్రజలు బయటకు వచ్చేయాలని సాదిఖ్‌ ఖాన్‌ విజ్ఞప్తి చేశారు.

సాధారణంగా లండన్ అగ్నిమాపక కేంద్రానికి సహాయం కోసం రోజుకు 300-350 ఫోన్‌లు వస్తాయని, అయితే ఈ రోజు మధ్యాహ్నం నాటికి 1,600 కంటే ఎక్కువ కాల్స్ వచ్చాయని సాదిఖ్ ఖాన్ చెప్పారు.

తూర్పు లండన్ శివార్లలోని వెన్నింగ్టన్ గ్రామంలో గడ్డి అంటుకొని మంటలు చెలరేగడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరికొన్నింటికి తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక భవనాలు గడ్డి భూములను మంటలనుంచి కాపాడటానికి 15 అగ్నిమాపక యంత్రాలు, సుమారు 100 మంది అగ్నిమాపక సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపింది. ఏరియల్ వ్యూలో ఎండిపోయిన పొలాల్లో మంటలు రేగి అవి ఒక చారిత్రాత్మక చర్చిని సమీపిస్తున్నట్లు కనిపించింది.

యూరప్‌లో పలు దేశాలు ఎండ దెబ్బకు అల్లాడుతున్నాయి. ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావం ఫ్రాన్స్, స్పెయిన్‌, జర్మనీ, బెల్జియం దేశాల్లో ఎక్కువగా ఉంది. ఫ్రాన్సు, స్పెయిన్‌, పోర్చుగల్‌, గ్రీసుల్లో అడవులను వారం రోజులుగా మంటలు దహించి వేస్తున్నాయి. వాతావరణ మార్పులతో చలి దేశాలు వేడి కొలిమిలా మారిపోతున్నాయి.

ఎండలకు తాళలేక ప్రజలు చల్లదనం కోసం నదుల్లో, సరస్సుల్లో సేద తీరుతున్నారు. ఎండల దెబ్బకు రైలు, రోడ్డు, విమాన ప్రయాణాలు రద్దవుతున్నాయి.  ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరితే రైల్వే ట్రాక్‌లపై వేడి 50 నుంచి 70 డిగ్రీల వరకు పెరిగిపోతుంది. దీంతో పట్టాలు వదులై రైలు బోగీలు పట్టాలు తప్పుతాయని అధికారులు తెలిపారు. వడదెబ్బకు గురైనవారిని వేగంగా ఆస్పత్రులకు తరలించడానికి అంబులెన్సులను, ఆస్పత్రి పడకలను సిద్ధం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేస్తున్నారు. ఎండలతో నీటికి డిమాండ్‌ ఏర్పడటంతో ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles