28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు… 50 మంది మృతి!

టెహ్రాన్/ ఇరాన్:  హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్‌ అట్టుడుకుతోంది. హిజాబ్ ధ‌రించ‌లేద‌న్న కార‌ణంతో మాసా అమీని అనే 22ఏళ్ల యువ‌తిని టెహ్రాన్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే కస్టడీలో తీవ్రంగా గాయపడిన ఆమె.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. పోలీసులు చిత్రహింసలతోనే మాసా అమీని మరణించిందని ప్రజలు రోడ్లపైకి వచ్చి హిజబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. క్రమంగా ఇవి దేశంలోని 80 పట్టణాలు, నగరాలకు విస్తరించాయి.

అయితే మహిళల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. టియర్‌ గ్యాస్‌, పెప్పర్‌ స్ప్రేలను ప్రయోగించి ఆందోళనలను అణచివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన అణిచివేతలో  కనీసం 50 మంది పౌరులు మరణించారని ఓస్లో కేంద్రంగా పనిచేస్తున్న ఇరాన్‌ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. అయితే ప్రభుత్వం 17 మంది మాత్రమే చనిపోయారని చెబుతుంది.కానీ దానికి మూడు రెట్లు అధికంగా మరణాలు ఉన్నాయని తెలిపింది. ఇందులో ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది.

నిరసనకారుల ఆందోళనలు  బయటి ప్రపంచానికి చేరకుండా ఆపడానికి ఇరాన్ ఇంటర్నెట్ వాడకంపై కఠినమైన ఆంక్షలు విధించింది. రాజధాని టెహ్రాన్‌ సహా అనేక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నిరసనకారులు గుమిగూడినట్లు ఉన్న ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘సొంత ప్రజలంటే భయం’
ఇస్లామిక్ రిపబ్లిక్‌లో తన కంపెనీ స్టార్‌లింక్ శాటిలైట్ సేవను అందించడానికి ఆంక్షల నుండి మినహాయింపు కోరుతానని SpaceX యజమాని ఎలోన్ మస్క్ చెప్పిన కొన్ని రోజులకే ఇంటర్నెట్ సేవలను విస్తరించడానికి ఇరాన్‌పై ఎగుమతి పరిమితులను సడలిస్తున్నట్లు యునైటెడ్ స్టేట్స్ శుక్రవారం ప్రకటించింది. ఈ చర్యలు “తన పౌరులను పర్యవేక్షించడానికి, సెన్సార్ చేయడానికి ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి” అని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. “ఇరాన్ ప్రభుత్వం తన సొంత ప్రజల గురించి భయపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది” అని బ్లింకెన్ అన్నారు.

మరోవంక శుక్రవారం టెహ్రాన్, ఇతర నగరాల్లో ప్రభుత్వ మద్దతుతో జరిగిన ర్యాలీలలో వేలాది మంది హిజాబ్‌కు మద్దతుగా వీధుల్లోకి వచ్చారు. “ఇరాన్ ప్రజలు కుట్రదారులను ఖండిస్తూ మరియు మతానికి వ్యతిరేకంగా చేసిన దూషణలను ఖండిస్తూ గొప్ప ప్రదర్శన ఈ రోజు జరిగింది” అని ఇరాన్ యొక్క మెహర్ వార్తా సంస్థ తెలిపింది. సెంట్రల్ టెహ్రాన్‌లో హిజాబ్ అనుకూల ప్రదర్శనకారుల దృశ్యాలను స్టేట్ టెలివిజన్ ప్రసారం చేసింది, వారిలో చాలా మంది మహిళలు నల్ల ఛాదర్‌లు ధరించారు.

‘విపరీతంగా రక్తస్రావం’
ప్రదర్శనకారులు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వారు, పోలీసు కార్లకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారని రాష్ట్ర వార్తా సంస్థ IRNA నివేదించింది. “ప్రత్యక్ష సాక్షుల నివేదిక ప్రకారం ప్రభుత్వం మందుగుండు సామాగ్రి, పెల్లెట్ గన్‌లు, టియర్ గ్యాస్‌ను ఆందోళనకారులపై ప్రయోగించింది. సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోల ప్రకారం, నిరసనకారులు విపరీతంగా రక్తస్రావం అవుతున్నట్లు చూపించారు” అని న్యూయార్క్‌కు చెందిన సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఇరాన్ (CHRI) తెలిపింది.

వెబ్ మానిటర్ నెట్‌బ్లాక్స్ కథనం ప్రకారం పట్టణంలో ఇంటర్నెట్ యాక్సెస్‌ను పరిమితం చేశారు. “సామాజిక మాథ్యమాలను కూడా సెన్సార్‌ చేశారు. చాలా మంది వినియోగదారులకు కనెక్టివిటీ అడపాదడపా వస్తూ పోతూ ఉంది. శుక్రవారం మూడవ రోజు మొబైల్ ఇంటర్నెట్ అంతరాయం కలిగింది” అని నెట్‌బ్లాక్స్ తెలిపింది.

“జాతీయ భద్రతకు వ్యతిరేకంగా ఆందోళనకారులు సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా చేపట్టిన చర్యలకు” ప్రతిస్పందనగా ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకుందని ఇరాన్  వార్తా సంస్థ ఫార్స్ తెలిపింది.

ని ఐక్యరాజ్యసమితి సమావేశం కోసం న్యూయార్క్‌లో ఉన్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ  ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ… అమీని మరణంపై విచారణ జరుపుతామని తెలిపారు. ఈ విషయంలో ఇరాన్ మీద ఆరోపణలు చేస్తూ పశ్చిమ దేశాలు ఆత్మవంచన చేసుకుంటున్నాయని మండిపడ్డారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles