33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

వసీమ్ అహ్మద్ భట్‌కు UPSCలో 7వ ర్యాంక్… కాశ్మీరీ యువతకు సాధికారత కల్పించాలనే లక్ష్యం!

న్యూఢిల్లీ:  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మంగళవారం సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌ ప్రాంతానికి చెందిన వసీమ్ అహ్మద్ భట్ 7వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించారు.

ఆజ్ తక్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… UPSC  ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ (AIR)లో మంచి ర్యాంక్ సాధించడం పట్ల వసీమ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తాను ఇంతకు ముందు పరీక్షకు ప్రయత్నించగా, ఇంత పెద్ద ర్యాంక్ సాధించలేదని పేర్కొన్నాడు.

కుటుంబం నుండి ప్రేరణ

సివిల్ సర్వీసెస్‌లో ఉత్తమ ర్యాంక్ సాధించడానికి తన తల్లిదండ్రులు,  తాతలు తనకు ప్రేరణగా నిలిచారని వసీం పేర్కొన్నాడు.  అతని తండ్రి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర వ్యవసాయ శాఖలో పనిచేస్తుండగా, అతని తల్లి గృహిణి.

“నా చిన్నప్పటి నుండి, నేను పెద్దయ్యాక DM అవుతానని ఇంట్లో అందరూ చెప్పేవారు, నేను NIT శ్రీనగర్‌లో ఉన్నప్పుడు, నేను UPSC గురించి తెలుసుకుని, దానికి సిద్ధమయ్యాను” అని అతను చెప్పాడు.

మూడవసారి అదృష్టవంతుణ్ని

వసీం NIT శ్రీనగర్ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో BTech పట్టభద్రుడయ్యాడు. 2020 ఢిల్లీలో నివసిస్తున్నప్పుడు UPSC కోసం ప్రిపేర్ అయ్యాడు. అయితే మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు.

అతను మళ్లీ 2021లో UPSC CSEకి హాజరయ్యాడు మంచి ర్యాంక్ సాధించలేకపోయాడు. ఈసారి ఏకంగా జాతీయ స్థాయిలో వసీం  7వ ర్యాంకు సాధించాడు.

ప్రజా సేవకు నిబద్ధత

కాశ్మీర్‌లో పరిస్థితిపై అతని దృక్పథం గురించి అడిగినప్పుడు, వసీం ప్రజలకు సేవ చేయడంలో తన అంకితభావాన్ని నొక్కి చెప్పాడు.

“ప్రజా సేవకులం కాబట్టి ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం. ముఖ్యంగా సమాజంలోని గిరిజన, వెనుకబడిన వర్గాల కోసం నేను పనిచేయాలి. కశ్మీర్‌లోని ప్రజలు చాలా ప్రతిభావంతులు. అవకాశం దొరికితే నిరూపించుకుంటారు” అని ఆయన అన్నారు.

UPSC పరీక్షలో మంచి ర్యాంకులు సాధించిన తన తోటి కాశ్మీరీ స్నేహితుల విజయాలను కూడా అతను ప్రశంసించాడు.

కాశ్మీర్‌లోని ప్రజలు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని, ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని వసీమ్ అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ఢిల్లీలో ఉన్నప్పటికీ, అతను ఎటువంటి ఆందోళనకు లోనవకుండా తన సివిల్ కోచింగ్ తరగతులను కొనసాగించాడు.

సవాళ్లు, మార్గదర్శకత్వం

అనంత్‌నాగ్‌లోని డూరు పట్టణం నుండి వచ్చిన వసీమ్… మారుమూల ప్రదేశాల నుండి వచ్చిన వ్యక్తులకు మార్గనిర్దేశం లేకపోవడాన్ని ఒక ముఖ్యమైన సవాలుగా గుర్తించాడు.

“నేను ఒక చిన్న పట్టణం నుండి వచ్చాను. సరైన మార్గదర్శకత్వం లేక  నేను  సమస్యను ఎదుర్కొన్నాను. ప్రస్తుతం, నేను నాగ్‌పూర్‌లో ఉన్నాను. ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న అనేక చిన్న ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడకు వస్తారు” అని ఆయన చెప్పారు.

“నేను కరోల్ బాగ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు, నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అక్కడ చాలా మందిని కలిశాము, మేము UPSC గురించి మాట్లాడేవాళ్ళం, పరీక్ష రాసిన వాళ్ల  అనుభవాన్ని తెలుసుకున్నాం” అని UPSC ర్యాంకర్ చెప్పారు.

UPSC ఇంటర్వ్యూ అనుభవం

UPSC ఇంటర్వ్యూలో, వసీమ్ తనను ఆంత్రోపాలజీకి  సంబంధించిన ప్రశ్నలు అడిగారని పేర్కొన్నాడు. ఇంటర్వ్యూ ప్యానెల్ అతని నేపథ్యం, మూలాల గురించి సాధారణ ప్రశ్నలను కూడా వేసింది.

తన ప్రయాణాన్ని వివరిస్తూ… 2020లో తన మొదటి ప్రయత్నంలో తాను మంచి పనితీరు కనబరిచినట్లు భావించినప్పటికీ, ఇంకా మెరుగవ్వాల్సిన అవసరాన్ని తాను గుర్తించానని, అలా జాతీయ స్థాయిలో మంచి ర్యాంక్ సాధించేలా ప్రేరేపించిందని వసీమ్ పేర్కొన్నాడు.

విజయాన్ని జరుపుకుంటున్నారు
ఫలితాలు వెల్లడైనప్పుడు, వసీం తన కుటుంబ సభ్యులతో ఆసక్తిగా వార్తలను పంచుకున్నాడు. అతని తల్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవగా,  అతని తోబుట్టువులు కూడా తమ ఉత్సాహాన్ని, సంతోశాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వసీంభట్, మరో ర్యాంకర్ ఇద్దరిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles