33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

రైల్వే పరీక్షల వివాదం… అట్టుడుకుతున్న బీహార్‌!

పాట్నా: పరీక్షల నిర్వహణపై రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయంపై బీహార్‌ అట్టుకుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా యువకులు ఆందోళనలు చేస్తున్నారు. అనేక పట్టణాల్లో గొడవలకు దిగారు. పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులపై లాఠీలకు పని చెబుతున్నారు. నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌కు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్షణ నిర్వహణలో మార్పు చేసింది. ఇది వరకు ఈ పోస్టులకు ఒకసారి పరీక్ష నిర్వహించే అభ్యర్థులను ఎంపిక చేసేవారు. అయితే ఈ పరీక్షలను రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించడంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్‌ ద్వారా నిర్వహించే ఈ పరీక్షను రెండుసార్లు నిర్వహించడమేంటని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. తొలిసారి ఫెయిల్‌ అయిన అభ్యర్థులను దొడ్డిదారిలో ఉద్యోగం కల్పించేందుకు రెండో దశ పరీక్ష నిర్వహిస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు. నిన్న బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగింది. రాత్రి అనేక పట్టణాల్లో ఆందోళనకారులను పోలీసులు లాఠీలతో కొట్టిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పాట్నా, నవాడా, ముజఫర్‌పూర్‌, సీతామర్హి, బక్సర్‌, భోజ్‌పూర్‌ జిల్లాలో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. బీహార్‌ అంతటా నిన్నటి నుంచి ఆందోళన ఉధృతమైంది. ముఖ్యంగా నిన్న రైల్వే బోర్డు చేసిన ప్రకటన నిరుద్యోగులను మరింత రెచ్చగొట్టింది. ఆందోళన నిర్వహిస్తున్న, రైళ్ళను ఆపుతున్నవారిని రైల్వో ఉద్యోగాల్లో తీసుకోకుండా నిషేధిస్తామని బోర్డు ప్రకటించడంతో… అన్ని పట్టణాల్లో నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చారు. ఎక్కడికక్కడ రైళ్ళను ఆపేశారు. ఇవాళ ఉదయం నుంచి ఉద్యమం మరింత ఉధృతం చేశారు. రైల్‌ రోకో నిర్వహిస్తూ… రైల్వే పట్టాలపైనే జాతీయ గీతాలాపన చేశారు. ప్రభుత్వ వైఖరిపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019లో జారీ చేసిన ఆర్‌ఆర్‌బి నోటిఫికేషన్‌లో ఒక్క పరీక్ష మాత్రమే ఉందని ఆందోళనకారులు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో అధికారులు ఆడుకుంటున్నారని ఆరోపించారు. మరోవంక ఆర్.ఆర్.బీ-ఎన్.టీ.పీ.సీ ఫలితాలపై అభ్యర్థుల నిరసన తర్వాత, ‘రైల్వే NTPCలెవెల్1‘ పరీక్షలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నిరసన తెలిపిన అభ్యర్థుల ఫిర్యాదులపై విచారణకు ఓ కమిటీని రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థుల అభిప్రాయాలను ఆలకించి, తన నివేదికను రైల్వే మంత్రిత్వ శాఖకు అందజేస్తుంది. ఆ తర్వాత రైల్వేశాఖ తదుపరి నిర్ణయం తీసుకోనుందని రైల్వే బోర్డు ప్రతినిధి ఏఎన్ఇ వార్తా సంస్థకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles