24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

నేడు, రేపు బెంగళూరులో విపక్షాల భేటీ!

న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు మరో కీలక భేటీకి సిద్ధమయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్ట్‌తో కాంగ్రెస్.. మిత్రపక్షాలతో కలిసి.. బలంగా మారేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పాట్నాలో తొలి సమావేశం (నితీశ్ అధ్వర్యంలో) సక్సెస్ అవ్వడంతో.. ఇవాళ, రేపు బెంగళూరులో రెండో సమావేశం జరగబోతోంది.

బెంగళూరు సమావేశానికి 26 పార్టీలకు సంబంధించిన కీలక నేతలు హాజరుకాబోతున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఎలా ఓడించాలి అన్న అంశంపైనే లోతైన చర్చ జరగనుందని తెలిసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ 2 రోజుల సమావేశాన్ని నిర్వహిస్తారు.

గత నెల 23న బిహార్‌లో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్న విషయం తెలిసిందే. బెంగళూరులో జరిగే సమావేశంలో పాల్గొననున్న విపక్ష పార్టీల సంఖ్య పెరిగింది. ఈ సమావేశానికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా హాజరు కానున్నారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమెకు శనివారం స్వయంగా ఫోన్‌ చేసి, సోమవారం జరిపే విందుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే.. ఆమె తన కాలి గాయం కారణంగా ఆమె నేరుగా సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది.

ఈమధ్య ఢిల్లీ సర్వీసులకు సంబంధించి కేంద్రం ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వ్యతిరేకించింది. ఈ ఆర్డినెన్స్‌ని కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తే.. తాము ఆ కూటమితో చేతులు కలుపుతామని ‘ఆప్’ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పడంతో.. దీనిపై కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ని పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని హామీ ఇచ్చింది. అందువల్ల ఆప్ కూడా ఈ మీటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

బిహార్‌ సమావేశంలో పాల్గొనని ఆర్‌ఎల్‌డీ, ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆర్‌ఎ్‌సపీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఐయూఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌ పార్టీలు బెంగళూరు భేటీకి హాజరవుతాయి.  మొత్తం 24 విపక్ష పార్టీలకు పార్లమెంట్‌లో 150 మంది ఎంపీలు ఉన్నారు. కాగా, కర్ణాటక సీఎం సిద్దరామయ్య సోమవారం నిర్వహించే విందులో అనధికారిక చర్చలు జరుగుతాయి.

మంగళవారం విస్తృత చర్చల తర్వాత నేతలంతా కలిసికట్టుగా విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. తమ కూటమికి ప్రత్యేక పేరును నిర్ణయించడంతో పాటు.. భవిష్యత్‌లో వివిధ రాష్ట్రాల్లో కలిసికట్టుగా ర్యాలీలు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సహా.. ఆయా విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీల్లో పాల్గొంటారు.

బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ధర్నాలు చేసేందుకు సంబంధించిన ప్లాన్‌ను బెంగళూరు సమావేశంలో డిసైడ్ చేస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ.. మహారాష్ట్రలో NCPని చీల్చేయడాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని విపక్షాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు.. శివసేనను కూడా బీజేపీ ఇలాగే చీల్చేసిందనే విషయాన్ని కూడా వారు ప్రజలకు చెప్పాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీయేతర రాష్ట్రాలను గవర్నర్లతో కంట్రోల్ చెయ్యాలని చూస్తోందని ఆరోపిస్తున్న పార్టీలు.. ఆ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నట్లు తెలిసింది.

మరోవంక ఈ సమావేశంపై ఆల్రెడీ బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. అసలు వాళ్లకు ఏ అజెండా ఉండదనీ.. ఉన్నదల్లా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓడించాలనే లక్ష్యం మాత్రమే అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాదు విపక్షాలు బలాన్ని చేజిక్కించుకోవాలంటే ముందు  తమ విభేదాలను పరిష్కరించుకోవాలని సీనియర్ నేత ఒకరు అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles