31 C
Hyderabad
Tuesday, October 1, 2024

సెప్టెంబర్‌ 18 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు…మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్!

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు మోదీ సర్కార్ పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబరు 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో..  అమృత్ కాలంలో నిర్వహించే పార్లమెంట్ సమావేశాల్లో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఎదురు చూస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం ఎందుకు పిలుపునిచ్చిందనే విషయాన్ని మాత్రం మంత్రి వెల్లడించలేదు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన  ట్వీట్‌తో దేశంలోని రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్లమెంట్‌ ప్రొరోగ్‌ అయి రెండున్నర వారాలు గడవకముందే మళ్లీ సమావేశాలు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకోవడం, ఈ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటన్న విషయంపై స్పష్టత లేనప్పటికీ.. పార్లమెంటు కొత్త భవనంలోకి మారేందుకే ఈ భేటీ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశాలు పాత భవనంలో మొదలై.. కొత్త భవనంలో ముగుస్తాయని తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని గత పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా సంకేతాలిచ్చిన కేంద్రం.. ఇంత అత్యవసరంగా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను ఎందుకు నిర్వహిసున్నట్టు? మోదీ సర్కారు ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ స్పష్టత మాత్రం రాలేదు. వీటితో పాటు జీ20 సదస్సులో కీలక చర్చలు జమ్ముకశ్మీర్ లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు, ప్రత్యేక సమావేశాల్లో దాదాపు 10 కీలక బిల్స్‌ ఆమోదం పొందేలా చేయాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని, ‘ఒక దేశం ఒకే ఎన్నికల’ బిల్లు, యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడతారేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

సాధారణంగా, ఒక సంవత్సరంలో మూడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి, బడ్జెట్ సెషన్‌తో ప్రారంభమై వర్షాకాలం మరియు శీతాకాల సమావేశాల వరకు కొనసాగుతాయి. ఎన్నికలకు ముందు మోడీ కొన్ని షోపీస్ బిల్లులను ప్లాన్ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ప్రతిపక్ష కాంగ్రెస్.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ మీద వచ్చిన తాజా ఆరోపణలు ప్రధానాంశం కాకుండా వార్తలను మేనేజ్ చేయటానికే మోదీ సర్కార్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. ముంబయిలో జరుగుతున్న ఇండియా కూటమి సమావేశాల్లో ఈ అంశంపై దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు.. అదానీ గ్రూపు మీద వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయాలని సభ లోపల, వెలుపలా ఆందోళన కొనసాగుతుందని.. జైరాం రమేష్ ట్వీట్ చేశారు.

ఇక,పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. “ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయనివ్వండి, ప్రతిపక్షాల పోరాటం కొనసాగుతుంది” అని ప్రతిపక్ష కూటమి I.N.D.I.A మూడో సమావేశానికి హాజరయ్యేందుకు ముంబైకి వచ్చిన ఖర్గే అన్నారు.

ఏది ఏమైనప్పటికీ  ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరగకముందే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ముందుస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదని విపక్షాలు అనుమానిస్తున్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles